తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఒకటో తేదీ కావడంతో గురువారం ఉదయమే పింఛన్లను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు చక్రాయపాలెంలో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన రోజంతా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పింఛన్ల పంపిణీ చేపట్టారు.
పింఛన్ల పంపిణీ తీరును పర్యవేక్షించారు. అలాగే గ్రామాల్లోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో ముచ్చటిస్తూ… యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ మనోహర్ పర్యటన సాగింది. గతంలో పెండింగ్ ఉండిపోయిన సమస్యలను తీర్చడంపై దృష్టిపెట్టామని, ప్రాధాన్యతానుసారం సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. పింఛన్లను అందుకున్న వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ, వారికి జాగ్రత్తలు చెప్పారు. ప్రజలు తెలిపిన ఇతర సమస్యలను విన్నారు.
ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని హామీ ఇచ్చారు. వృద్ధులు మనోహర్ ని చూసి మా పెద్ద కొడుకే ఇంటికి వచ్చినట్టుందయ్యా… అంటూ అప్యాయంగా పట్టుకొని పలకరిస్తూ మురిసిపోయారు. దారి మధ్యలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ… గ్రామస్తులకు అభివాదం చేస్తూ మనోహర్ ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఉదయం చక్రాయపాలెంతో మొదలైన పింఛన్ల పంపిణీ తర్వాత జెముడుపాడు, దావులూరు, దంతులూరు, తూములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, కోపల్లె, అంగలకుదురు గ్రామాల్లో సాయంత్రం వరకు సాగింది.
అన్ని కార్యక్రమాల్లో మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల సొమ్మును అందజేశారు. గ్రామాల్లోని నాయకులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తిస్తుంది. ప్రజల ఆకాంక్షలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి తెలుసు. వారిరువురి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు పనిచేస్తారు.
అందరికీ మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లోని సమస్యల పట్ల అవగాహన ఉంది. వాటిని ప్రాధాన్యత పరంగా పరిష్కరించుకుందాం. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.