వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతునూ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వరదబాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి, నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాలు, వరదలపై శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ
ఈ వరదల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతమైనప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడింది. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడులు పూర్తీగా దెబ్బతిన్నాయి. 1.06 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అదంతా కూడా వరద నీటి ముంపునకు గురైంది. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం అంచనాలన్నీ కేవలం ప్రాథమిక అంచనాలే. క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలున్నాయి. తూర్పు గోదవారి జిల్లాలో 273 ఎకరాల్లో పంటలు ఇప్పుడు కూడా నీళ్లలోనే మునిగిపోయి ఉన్నాయి. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. గతంలో హుదుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సాయం చేశాం. ఇప్పుడు ఈ ఐదారు జిల్లాల్లో వచ్చిన విపత్తుల వల్ల నష్ట పోయిన వారందరికీ కూడా సాయం అందిస్తాం. వరద బాధితులందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నా.
వరదల్లో ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు పామాయిల్, కేజీ బంగాళ దుంపలు , కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాం. అవి ఒకవైపు ఇస్తూనే, గతంలో ఎన్నడూ ఇవ్వని విధంగా ఎక్కడైతే ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా వచ్చి చేరిందో, ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్లందరికీ ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. నేనే స్వయంగా వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నా. కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కుదరడం లేదు. బాధితులను పరామర్శించడానికి తక్షణం వరదబాధిత ప్రాంతాలకు వెళ్లాలని మంత్రులు అనిత, అచ్చెన్నాయిడలను ఆదేశిస్తున్నాఅని చంద్రబాబు అన్నారు. వారి వెంట ఆయా జిల్లా మంత్రులు కూడా పర్యటనల్లో పాల్గొనాలి. బాధితులను పరామర్శించాలి, అక్కడ జరిగిన నష్టం అంచనాలు మంత్రులకు అందజేయాలి. ఏఏ పంటలు ఎంతమేర నీట మునిగాయి, ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత వరకు ఇవ్వొచ్చు, మళ్లీ రైతులు కోలుకోవాలంటే ఏం చేయాలి, ఏమివ్వాలనేది నాకు ఒకసారి వివరిస్తే ఆ ప్రకారం వాళ్లను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన వరదలకంటే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడంతో గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతం ముంపునకు గురైంది. బాధితులను ఆదుకునే విషయంలో ఇప్పుడుండే నిబంధనావళి కంటే కూడా ఎక్కువ సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం సమర్థత ఏంటో, ప్రభుత్వం ఉదారత ఏంటనేది తెలుస్తుంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యనించారు.