28.7 C
Hyderabad
April 20, 2024 07: 44 AM
Slider ప్రత్యేకం

సీఎం నిబంధనలను అతిక్రమిస్తుంటే ఐఏఎస్  అధికారులు ప్రశ్నించరా?

#raghu

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇష్టారీతిలో వ్యవహరిస్తూ, నిబంధనలను అతిక్రమిస్తున్నా ఐఏఎస్ అధికారులు ఆయన్ని ప్రశ్నించరా?, కేంద్ర సర్వీసులలో ని జూనియర్ కేడర్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి కీలక బాధ్యతలు కట్టబెట్టినా, రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు సిగ్గనిపించడం లేదా? ఐఏఎస్ అధికారులు ఏమి చేస్తున్నారు… అడుక్కుతింటున్నారా? ఇంత జరుగుతున్నా మీకు  తలవొంపులుగా అనిపించడం లేదా? ఐఏఎస్ అధికారులు అంటే ప్రజలకు ఎంతో గౌరవం.

జిల్లా కలెక్టర్ గా వ్యవహరించే ఐఏఎస్ అధికారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా  కలెక్టర్ గారు అని సంబోధిస్తారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను కాదని కీలక బాధ్యతలను డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ క్యాబినెట్ కార్యదర్శి కి, డి ఓ పి టి  కి ఫిర్యాదు చేయరా? నేనే ఫిర్యాదు చేయాలా? అంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమించి ముఖ్యమంత్రి తనకు నచ్చిన వ్యక్తులను కీలక  స్థానాలలో నియమించుకోవడానికి వీలులేదు.

ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది నీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేయడానికి కాదు. రూల్స్ బుక్ ను కచ్చితంగా అనుసరించి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.  శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీటీడీ ఈవో పోస్టులో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కలిగిన  ఐఏఎస్ అధికారిని నియమించాలి. టీటీడీ ఈవో పోస్ట్ అన్నది ఐఏఎస్ అధికారుల హక్కు. ఆ పోస్టులోనూ  ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్  ( ఐ డి ఏ ఎస్ ) నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి బదిలీ అయి  వచ్చిన ధర్మారెడ్డి నియమించారు.

ధర్మారెడ్డి దైవభక్తి కలిగిన, సమర్ధుడైన అధికారే. కానీ రాష్ట్ర క్యాడర్ కు చెందిన  ఎంతోమంది సమర్థులైన, దైవభక్తి కలిగిన ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిని టీటీడీ ఈవో పోస్టులో ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీటీడీ ఇన్చార్జ్ ఈవోగా  వ్యవహరిస్తున్న ధర్మారెడ్డి, రెవిన్యూ సర్వీస్ అధికారిని  నియమించాల్సిన జేఈవో పోస్టులోనూ   కొనసాగుతున్నారు. మరొక జె ఈ ఓ పోస్ట్ ఖాళీగానే ఉంది. రాష్ట్రంలో డిఐజి కూడా  ఇన్చార్జ్ హోదాలోనే కొనసాగుతుండడం ఆశ్చర్యకరం. డీఐజీ పదవిలో నియమించడానికి ఐదు మంది  సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించగా, వారిని కాదని ఇంచార్జ్ డిజిపి గా తన సామాజిక వర్గానికి చెందిన అధికారికి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు.

కీలక పదవుల్లో  జూనియర్ స్థాయి అధికారులు

రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే కీలక శాఖల పదవి బాధ్యతలను కేంద్రతోపాటు,  ఇతర సర్వీసుల నుంచి  డిప్యూటేషన్ పై బదిలీ అయి  వచ్చిన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కట్టబెట్టడం హాస్యాస్పదంగా ఉంది.   ఏప్రిల్ మాసంలో ఇదే విషయంపై డి ఓ పి టి కి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.  రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా సెక్రటరీ స్థాయి కలిగిన  ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా, 2009 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి  రామకృష్ణ కు కట్టబెట్టడం పట్ల  రఘురామకృష్ణం రాజు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

గత మాసంలో తాను రాసిన లేఖ పై డి ఓ పి టి అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఓ లేఖ రాశారని తెలిపారు. ఇలా కేంద్ర, ఇతర సర్వీసుల నుంచి వచ్చిన వారికి, ఎవరెవరికి కీలక బాధ్యతలను  కట్టబెట్టారని ప్రశ్నించిందన్నారు . దీన్నిబట్టి  రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన  కొనసాగుతుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్నది పరిపాలకులా?… శిశుపాలురా అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, వీరికి ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఉందా?? అని నిలదీశారు. ఈనాడు దినపత్రికలో వార్తా కథనాన్ని రాస్తే, సాక్షి దినపత్రికలో  చెత్త సమాధానాన్ని చెప్పే రాష్ట్ర పెద్దలు, దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ కు చెందిన కె వి వి సత్యనారాయణ ను నియమించారు. కేంద్ర సర్వీస్  నుంచి 2017లో రాష్ట్ర సర్వీసులోకి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన, 2019లోనే తిరిగి కేంద్ర సర్వీసులోకి వెళ్లాలి. కానీ ఆయనకు మరో రెండేళ్ల పదవీ కాలాన్ని పొడిగించి, రాష్ట్ర ఆర్థిక శాఖ  ప్రత్యేక కార్యదర్శిగా కీలకమైన పదవిలో కెవివి సత్యనారాయణ ను ముఖ్యమంత్రి నియమించారు. రాష్ట్ర కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తే, తాము చెప్పినట్లుగా నడుచుకోడనే ఉద్దేశంతో సత్యనారాయణకు కీలక పదవీ బాధ్యతలను అప్పగించారు.

తాము చేసే దొంగ అప్పులను దాచిపెట్టడం, అప్పుల వివరాలు ఎవరైనా అడిగితే ఇవ్వకపోవడం, సి ఎఫ్ ఎం ఎస్  సైట్ పనిచేయకుండా  చూడడం సత్యనారాయణ వంటి వారే  చేస్తారు. అదే రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయితే తప్పు చేస్తే తానే బాధ్యుడు అవుతారు కాబట్టి, ఎటువంటి తప్పు చేయడానికి సాహసించరు. అదే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకు బదిలీపై  వచ్చిన వారు తమ పదవీ కాలం ముగియగానే, తిరిగి మాతృ శాఖకు వెళ్ళిపోయే వెసులుబాటు ఉంటుంది. దీనితో,   వారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసే తప్పులను కప్పిపుచ్చడంతోపాటు, ఎటువంటి తప్పులను చేయడానికి అయినా వెనుకంజ వేయరు.

అందుకే జగన్మోహన్ రెడ్డి  కేంద్ర సర్వీసులలో చిన్న చిన్న కేడర్ అధికారులను తీసుకువచ్చి రాష్ట్రంలోకీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర బేవరేజెస్  కార్పొరేషన్ చైర్మన్ గా  2009 బ్యాచ్ కు చెందిన  ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రానికి అత్యంత ఆదాయం తెచ్చిపెట్టే రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్  కీలక బాధ్యతలను వాసు దేవ రెడ్డికి అప్పగించడం వెనుక తాను చెప్పిన దాని కల్లా జీ… హుజూర్ అనే అధికారి కావాలనే ఉద్దేశంతోనే ఆయన్ని నియమించారు.

అదే ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెడితే, రూల్స్ బుక్ ను అనుసరించి నడుచుకుంటాడనే ఉద్దేశంతో, కేంద్ర సర్వీసులకు చెందిన రెడ్డి అధికారులకు వలవేసి పట్టుకొని  తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో  ప్రభుత్వ శాఖలలో కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మైనింగ్ శాఖ బాధ్యతలను  కనీసం యూపీఎస్సీ పరీక్ష రాసిన అధికారి క్యాడర్ కూడా కానటువంటి ఇండియన్ ఆర్మీలో కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కు చెందిన వీజీ వెంకట్ రెడ్డి అనే అధికారికి ముఖ్యమంత్రి కట్టబెట్టారు. తొలుత  వీజీ వెంకట్ రెడ్డి కి విద్యాశాఖలో బాధ్యతలు అప్పగించి, ఆ తరువాత మైనింగ్ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

మైనింగ్ శాఖ బాధ్యతలను  ఇండియన్ రైల్వే సర్వీస్ కు  మధుసూదన్ రెడ్డి కి తొలుత కట్టబెట్టగా,  పంపకాలలో ఆయనతో వచ్చిన తేడాల కారణంగా ఫైబర్ నెట్ కు   బదిలీ చేసి, మధుసూదన్ రెడ్డి స్థానంలో వీజీ వెంకట్ రెడ్డి ని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు టెండర్లను అధికారికంగానే పిలిచి, అనధికారికంగా జిల్లాల వారీగా టార్గెట్లను నిర్దేశించి తమకు కావలసిన వారికి కాంట్రాక్టు బాధ్యతలను అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా ఇసుక, మట్టి తవ్వకాల కాంట్రాక్టును  విశ్వసముద్రం  కంపెనీకి కట్టబెట్టారు. ఇసుక, మట్టి తవ్వకాలలో ప్రభుత్వం నిర్దేశించిన సొమ్మును  చెల్లించి మిగతాది కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దలు కలిసి పంచుకుంటున్నారు.

గోదావరి జిల్లాల ఇసుక, మట్టి తవ్వకాల కాంట్రాక్టు బాధ్యతలను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో పోటీ చేసిన ఒక వ్యక్తికి అప్పగించారు. ఆయనకే మరికొన్ని జిల్లాలను కూడా అప్పగించారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు వీజీ వెంకట్ రెడ్డి  లాంటి అధికారులు మాత్రమే సహకరిస్తారని, ఐఏఎస్ అధికారులైతే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో  కీలక బాధ్యతలను  అప్పగించి ప్రజాసంపదను కొల్లగొట్టి తమ ఆస్తులను పెంచుకుంటున్నారు.

Related posts

ఎష్యూరెన్స్: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభా స్థలి ఖరారు

Satyam NEWS

వనపర్తిలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Satyam NEWS

Leave a Comment