రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ అడగడం, ఆమె కాదనడం అనే అంశాలే లేవు. అయితే ఒక ఇంగ్లీష్ దినపత్రిక, ఆ తర్వాతి రోజు ఒక తెలుగు దినపత్రిక రాసిన ఒకేలాంటి వార్తలతో తెలంగాణ మొత్తం ఒక రకమైన ఊహాగానాలలో విహరిస్తున్నది. కొందరు అనుకూలంగా మరి కొందరు వ్యతిరేకంగా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అయితే తమిళిసై లాంటి యాక్టీవ్ రాజకీయ నేత రావడంతోనే వారు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కు కష్టాలు తప్పవని, తద్వారా తాము కేసీఆర్ ను దారికి తెచ్చుకోవచ్చునని వారు ఆశపడుతున్నారు. కొత్త గవర్నర్ నియామకంతో తెలంగాణ లో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయని కూడా బిజెపినేతలు అనుకుంటున్నారు. అయితే అలా జరిగేందుకు అవకాశం మాత్రం కనిపించడం లేదు. బిజెపి నాయకులు తాము పార్టీ క్యాడర్ ను లీడర్లను పెంచుకోకుండా గవర్నర్ వైపు చూస్తూ కూర్చుంటే మాత్రం వారు అనుకున్నది సాధించడం జీవిత కాలం లేటు అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా పై భారం వేస్తున్న తెలంగాణ బిజపి నాయకులు ఏ మాత్రం కూడా ప్రభావశీలమై కార్యాచరణ అమలు చేయలేకపోతున్నారు. కేసీఆర్ పై వ్యతిరేకత రెచ్చగొట్టాలని వారు చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడా స్పందన రావడం లేదు.
బిజెపిలో చేరుతున్న మాజీ తెలుగుదేశం నాయకులను చూసి వారు ముచ్చట పడుతుంటే చేయగలిగింది ఏమీ లేదు. టిఆర్ఎస్ లోకివారికి ప్రవేశం లేక బిజపి వైపు వచ్చారనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ కూడా తొందరపాటును ప్రదర్శించిందనడంలో సందేహం లేదు. గవర్నర్ గా తమిళిసై రాక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్ వో జ్వాలా నర్సింహరావు గవర్నర్ ల వ్యవస్థపై విమర్శలతో ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఇది కేసీఆర్ అభిప్రాయంగా చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి పిఆర్ వో కాబట్టి. జ్వాలా నర్సింహారావు గవర్నర్ వ్యవస్థపై అకస్మాత్తుగా ఎందుకు రాశారో ఆయనకే తెలియాలి.
కేసీఆర్ చెప్పి రాయించారా? ఆయన రాసే ముందు కేసీఆర్ అనుమతి తీసుకున్నారా అనేవి ప్రశ్నలు. కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా రాసేంతటి సాహసానికి జ్వాలా నర్సింహారావు ఒడికట్టరనేది ఆయన గురించి తెలిసిన వారి అభిప్రాయం. అంటే ఇది కేసీఆర్ అభిప్రాయమనేనా? ఈ వాదనకు అంగీకరించే వారు కేసీఆర్ కు గవర్నర్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే నిర్ణయానికి వచ్చేశారు. గవర్నర్ ను నియమించే ముందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించే గౌరవ ప్రదమైన సాంప్రదాయాన్ని ఎవరూ పాటించడం లేదు.
కేంద్రం పంపే గవర్నర్ ను వారి ఏజెంటుగా చూసే సాంప్రదాయాన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవడం లేదు. అందువల్ల గవర్నర్ తమిళ సై పట్ల టిఆర్ఎస్ నాయకులు ఈ విధమైన అభిప్రాయం ఉండటంలో ఆశ్చర్యం లేదు. వివాదం అంతా జ్వాలా నర్సింహారావు వ్యాసం వల్ల వచ్చిందే తప్ప కేసీఆర్ కోరింది, గవర్నర్ వద్దన్నది లేనేలేదు (ఇప్పటి వరకూ) రాజకీయంగా కల్లోల పరిస్థితులు ఉంటే తప్ప గవర్నర్ ప్రత్యేకంగా ఏం చేసేందుకు అవకాశం ఉండదు. సాధారణ పరిస్థితులలో అయితే గవర్నర్ కేవలం వివరణ కోరే అవకాశం ఉంటుంది తప్ప ప్రత్యక్ష కార్యాచరణ చేసేఅవకాశం లేదు. అసాధారణ పరిస్థితులు వస్తాయని ఇప్పుడే ఊహించుకోవడం రాజకీయంగా కరెక్టు కాదు. అలా వచ్చిన నాడు తప్ప అప్పటి వరకూ తమిళిసై మంత్రి వర్గ నిర్ణయాలకు అనుగుణంగా తలూపాల్సిందే.
అందుకే అప్పటిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించి వచ్చిన తలసాని కి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం చెప్పలేని నర్సింహన్ తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వచ్చి టిఆర్ ఎస్ లో విలీనం అయిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా ఏమీ అనలేకపోయారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం టిఆర్ ఎస్ లో విలీనం అయింది కదా ఇప్పడు అభ్యంతరం ఏముంటుందని టిఆర్ ఎస్ అభిమానులు ప్రశ్నించవచ్చు. అడ్డు చెప్పాలనుకుంటే లక్షా తొంభైకారణాలు ఉంటాయి. అయితే తమిళిసై గానీ, ఆమెను నియమించిన కేంద్రం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే గవర్నర్ల పాత్ర నామమాత్రమే.