26.2 C
Hyderabad
December 11, 2024 20: 08 PM
Slider జాతీయం సంపాదకీయం

‘రిజర్వు’ నిధులతో ఏం చేస్తారో?

reserve bank of India

ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తలచుకుంటే జరగని పని ఏమీ లేదని మరొక సారి రుజువైంది. జమ్మూ కాశ్మీర్ కు సబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి రాజకీయంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న ప్రధాని నరేంద్రమోడీ రిజర్వుబ్యాంకు నుంచి మిగులు నిధులను తీసేసుకుని పరిపాలనా పరంగా తాను చెప్పిందే వేదమని నిరూపించారు. రిజర్వు బ్యాంకు నుంచి మిగులు నిధులు తీసేసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నది. అలా చేయడం కుదరదని చెప్పిన అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ను వదిలించుకునే వరకూ మోడీ ప్రభుత్వం నిద్దర పోలేదు.

ఆ తర్వాత తనకు అనుకూలమైన వ్యక్తి గుజరాత్ మూలాలు ఉన్న ఉర్జిత్ పటేల్ ను రిజర్వు బ్యాంకు గవర్నర్ గా నియమించుకున్నారు. ఉర్జిత్ పటేల్ మోడీకి అనుకూలుడైనా, గుజరాత్ వాడైనా కూడా బ్యాంకర్, ఆర్ధికవేత్త. అందువల్ల మిగులు నిధులు ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరికి ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్ ను రిజర్వు బ్యాంకు గవర్నర్ గా నియమించారు. శక్తికాంత్ దాస్ నియామకంతోనే చాలా మందికి అర్ధం అయిపోయింది, ఇది కేవలం రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులను తీసుకోవడానికి చేసిన నియామకమేనని. అది ఇప్పటికి రుజువు అయింది.

కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిధులను ఆర్‌బీఐ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు బిమల్‌జలాన్‌ కమిటీ ప్రతిపాదనకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన బిమల్‌జలాన్‌ కమిటీ రిజర్వుబ్యాంకు మిగులు నిధులను నామమాత్రంగానైనా సరే మూడు నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వానికి బదిలీచేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక లోటును తీర్చుకోవడానికి రిజర్వుబ్యాంకు పై వత్తిడి తీసుకువస్తున్నది. నేరుగా అది కుదరకపోవడంతో బిమల్ జలాన్ కమిటీ ద్వారా దాన్ని చెప్పించింది.

ఇప్పటి వరకూ ఆర్‌బిఐ డివిడెండ్‌ రూపంలోనే కేంద్ర ప్రభుత్వానికి నిధులు బదిలీచేస్తోంది. 2016-17లో 65,876 కోట్లు, 20170-18లో 40,659 కోట్లు, 2018-19లో 68వేల కోట్లు, 2019-120ఆర్ధిక సంవత్సరాల్లో 90వేల కోట్లను డివిడెండ్‌ రూపంలోప్రభుత్వానికి బదిలీచేసింది. అయితే ప్రభుత్వం వీటితో సంతృప్తి చెందలేదు. రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే ఆర్‌బీఐ రేటింగ్‌కు భారీగండి పడుతుం దని మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రభుత్వాన్ని గతంలో హెచ్చరించారు. ఒక వేళ ఆర్‌బీఐ రేటింగ్‌ ‘ఏఏఏ’ నుంచి కిం దికి దిగివస్తే దాని ప్రభావం ఆర్థికవ్యవస్థపై పడుతుందని ఆయన అనేవారు.

అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు నిర్వహిం చాలనుకున్నప్పుడు ఆర్ బిఐ రేటింగ్‌ చాలా అవసరం. కరెన్సీ విలువ తగ్గినపుడే ఆర్‌బీఐకి లాభాలు వస్తాయి. పెరిగితే లాభాలు తగ్గుముఖం పడతాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్ పై కూడా ఆధారపడిఉంటుంది కాబట్టి ఆర్‌బీఐ పెద్దమొత్తంలో నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రూపాయి బలహీనపడినప్పుడు దాన్ని బలోపేతం చేయాలంటే నిల్వలు అవసరం అవుతాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి బిమల్ జలాన్ కమిటీ సిఫార్సు మేరకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు రూ.1,76,051 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,23,414 మిగులు నిధులతో పాటు ఎకనామిక్‌ కేపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఈసీఎఫ్‌) కింద మరో రూ.52,637కోట్లను ఇచ్చేందుకు సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. బిమల్ జలాన్ కమిటీ ముక్తకంఠంతో ఈ విషయాన్ని చెప్పలేదు. ఆ కమిటీలోని సభ్యులు ఇలా నిధుల బదిలీని వ్యతిరేకించారు కూడా. అయినా కాగల కార్యం గంధర్వులు తీర్చేశారు. దేశం ఇప్పుడు ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

రిజర్వు బ్యాంకు నుంచి ‘బలవంతంగా’ తీసుకున్న ఈ నిధులను సక్రమంగా, ఆదాయం పెంచుకోవడానికో, మౌలికవసతులు పెంచుకోవడానికో, ఉద్యోగాల కల్పనకో వాడుకుంటే ఫర్వాలేదు కానీ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసేస్తే రిజర్వు బ్యాంకుతో సహా అందరూ కలిసి మునగాల్సి వస్తుంది.

Related posts

మోహన్ బాబు, మంచు లక్ష్మి తొలిసారి కలిసి నటిస్తున్న అగ్నినక్షత్రం టైటిల్ లాంచ్

Satyam NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS

ప్రేమ పెళ్లి ప్రచారంతో నేతాజీ జీవితచరిత్రను మార్చగలరా?

Satyam NEWS

Leave a Comment