ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు వచ్చారు. తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమిటి? ఇలా ప్రతి శుక్రవారం ఇక నుంచి రావాల్సిందేనా? ఇది తేలాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. నేటి ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సిఎం జగన్ తరపు న్యాయవాది మళ్లీ వ్యక్తిగత మినహాయింపునకు పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు సీబీఐ న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన అనంతరం వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునే వీలు ఉంది. గత ఏడాది మార్చి 1న చివరి సారిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు.
ఆ తర్వాత ఎన్నికలు రావడం, గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దాన్ని కొట్టేశారు. దాంతో జగన్ కోర్టుకు రావాల్సి వచ్చింది. పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కేసును ఈ నెల 17వ తేదీకి కేసును వాయిదా వేశారు. ఆ తర్వాత మరో రెండు మూడు వాయిదాలు అయిన తర్వాత వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో కేసు ట్రయల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. న్యాయమూర్తి నిర్ణయంపై ఈ విషయం ఆధారపడి ఉన్నా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంటుంది. ట్రయల్ ప్రారంభం అయిన తర్వాత ఇప్పటి వరకూ బెయిల్ పై ఉన్న నిందితులకు బెయిల్ కొనసాగిస్తారా లేదా అనే విషయం కూడా న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది.