గోదావరి నదిలో దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి ఐదు బోట్లు ఉండగా వరద కారణంగావాటిని నిలిపివేసినప్పుడు ప్రయివేటు బోట్లు ఎందుకు నడుపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రైవేటు బోట్లను అడ్డుకునే అధికారం టూరిజం అధికారులకు లేనప్పుడు నీటిపారుదల శాఖకు ఆపే అధికారం ఉందికదా? అని సిఎం ప్రశ్నించారు.కంట్రోల్‌రూమ్స్ ఉండాలంటూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు నియంత్రణా వ్యవస్థే కనిపించడం లేదు, కేవలం నామ మాత్రంగా ఉంది, అన్నీ జీవోలకే పరిమితం అయ్యాయని సీఎం వ్యాఖ్యానించారు. పోలీసు అధికారులు, నీటిపారుదల అధికారులు, టూరిజం అధికారులతో కూడిన కంట్రోల్ వ్యవస్ధ పెట్టాల్సి ఉండగా పెట్టలేదు, అసలు శాఖల మధ్యే సమన్వయంలేదని విషయం బయటపడిందని సీఎం అన్నారు. లైసెన్స్ ఇవ్వగానే బాధ్యత తీరదు, క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. టూరిజంకు సంబంధించినంత వరకూ తూర్పు, పశ్చిమగోదావరిలో 68 బోట్లు, రాష్ట్రవ్యాప్తంగా 81 బోట్లు ఉన్నాయి. వీటన్నింటికీ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియను, తనిఖీలు చేసే తీరును మార్చాలి అని అధికారులకు సిఎం స్పష్టం చేశారు. బాధితులను చూసినప్పుడు గుండె చెరువయ్యిందని సిఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆస్పత్రిలో వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. మనం అంతా ఏంచేస్తున్నామనిపిస్తోంది. అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే బోటును ఆపగలిగే అవకాశం ఉన్నా.. ఆపలేకపోయాం. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి’ అని సీఎం అన్నారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో తెలంగాణా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఏపీ డిప్యూటి సీఎం ఆళ్ల నాని, మంత్రులు మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత స్దానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
previous post
next post