29.7 C
Hyderabad
April 18, 2024 02: 59 AM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఈటలను మట్టుపెట్టే ఈ కుట్ర ఎవరిది?

1976etela

పొలిటికల్ రిపోర్టింగ్ అంటే రాజకీయాల గురించి రాయడం. వాటిపై విశ్లేషణలు చేయడం -ఇది జర్నలిజంలో భాగం. ఇప్పుడు జర్నలిజంలోని ఈ భాగం కొంచెం ముందుకు వెళ్లింది. కొంచెం కాదు బాగానే ముందుకు వెళ్లినట్లు కనిపిస్తున్నది. జరిగిన రాజకీయాలను విశ్లేషించడం కాకుండా రాజకీయాలు చేయడం ఇప్పుడు జర్నలిజంలో ఒక భాగం అయిపోయింది. రాజకీయం చేయడమే కాకుండా రాజకీయ కుట్రలు పన్నడం తాజాగా మొదలైనట్టు ఇటీవల జరిగిన ఒక సంఘటన నిరూపిస్తున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర పై ఇటీవల రెండు పత్రికలలో దాదాపుగా ఒకే కథనం ప్రచురితం అయింది.

ఆ వార్త సంక్షిప్తంగా -ఇటీవల ప్రగతి భవన్‌లో రెవెన్యూ కొత్త చట్టంపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎనిమిది గంటలపాటు అనేక సున్నిత అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కీలకమైన ఈ సమావేశం వివరాలను రహస్యంగా ఉంచాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే సమావేశ వివరాల కోసం ఎదురు చూస్తున్న కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి మంత్రి ఈటల రాజేందర్‌ను శామీర్‌పేటలోని ఆయన నివాస గృహంలో కలిసినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఆ వెంటనే చట్టం మార్పుల వివరాలు బయటకు రావడం, ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తున్నది- ఇదీ ఆ వార్త సారాంశం.

చట్టం వివరాలు మంత్రి సంబంధిత ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పారని, ప్రభుత్వం పైకి వారిని ఉసిగొల్పి ఉద్యమం చేసే విధంగా వారిని ప్రోత్సహించారనేది వార్త కథనం. రహస్యంగా ఉండాల్సిన కీలక అంశాలు కొన్ని గంటల వ్యవధిలోనే బయటకు లీక్ కావడం దానిపై సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని కథనంలో రాస్తూ అసలు ఆ విషయాలు బయటికి ఎలా పొక్కాయని ఆరాతీయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఈటల రాజేందర్‌ను కలిసిన విషయం బయటపడినట్లుగా తెలియవచ్చిందని కథ అల్లారు.

అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశ వివరాలపై అధికారులు, మంత్రులు నోరువిప్పకున్నా ఓ మంత్రి మాత్రం సమావేశ చర్చల వివరాలు తెలియజేసినట్లుగా రెవెన్యూ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది అంటూ మంత్రి ఈటలపై బురద చల్లారు. మంత్రితో సమావేశమై బయటికి వచ్చినవెంటనే ఆర్డీవో లచ్చిరెడ్డి, మేడ్చల్ ఎమ్మార్వో గోవర్థన్‌ను కలిశారు. ఆ తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైన రవీందర్‌రెడ్డిని రహస్య ప్రాంతానికి పిలిపించుకున్నారు. అక్కడే కొత్త రెవెన్యూ చట్టం మార్పుల గురించి, వాటిని ఎలా వ్యతిరేకించాలనే విషయాల గురించి అర్ధరాత్రివరకు మంతనాలు జరిపారు అని కూడా ఈ రెండు పత్రికలలో రాశారు.

ఒక్క సారిగా ఊలిక్కి పడ్డ రెవెన్యూ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు హుటాహుటిన క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది వారి క్లారిఫికేషన్ ఏమిటంటే – త‌ప్పుడు వార్త‌ల‌ను ఖండిస్తున్నాం- రెవెన్యూ ఉద్యోగ సంఘాలు- మీడియా సోద‌రుల‌కు విజ్ఞ‌ప్తి.. ఇవాళ (24.08.2019) రెండు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన అస‌త్య‌పు, త‌ప్పుడు వార్త‌ల‌ను పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ వార్త‌లు దురుద్దేశ్య‌పూర్వ‌కంగా రాసిన‌విగా మేము భావిస్తున్నాము. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయ‌కులుగా మేము క‌లిసిన సంద‌ర్భాన్ని పూర్తిగా వ‌క్రీక‌రించి, అస‌త్యాల‌ను జోడించి రాసిన క‌ట్టుక‌థ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజ‌నిజాల‌ను ప్ర‌స్తావించ‌కుండా రెండు ప‌త్రిక‌లూ ఒకే ర‌క‌మైన దుష్ప్ర‌చారానికి పూనుకున్న‌ట్లు మేము భావిస్తున్నాము.

రెవెన్యూ ఉద్యోగుల‌ను బ‌ద‌నాం చేయ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా ఈ క‌ట్టుక‌థ‌ల‌ను వార్త‌లుగా ప్ర‌చురించారు.-మంత్రి గారిని క‌లిసిన ఉద్దేశ్యం- రాజేంద్ర‌న‌గ‌ర్ త‌హ‌శీల్దార్‌, తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం(టీజీటీఏ) కోశాధికారి రాములు కుమారుడు సంతోష్‌(7) గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. డ‌యాలిసిస్ కూడా కొన‌సాగుతోంది. అయితే, ఇటీవ‌ల ఆరోగ్య శ్రీ, ఎంప్లాయ్ ఆండ్ జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీం(ఈజేహెచ్ఎస్‌) సేవ‌లకు ఇటీవ‌ల తాత్కాలికంగా అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీంతో ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బాబుకు ఒక్క సిట్టింగ్ చికిత్స‌కు సుమారు రూ.70 – 90 వేల వ‌ర‌కు ఖ‌ర్చు వ‌స్తోంది. ఇది త‌హ‌శీల్దార్ రాములుకు పెను భారంగా మారింది. ఆయ‌న త‌న బాధ‌ను రెవెన్యూ సంఘ నాయ‌కులుగా మా దృష్టికి తీసుకువ‌చ్చారు.

దీంతో రాములు కుమారుడి చికిత్స కోసం ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని స‌హ‌క‌రించాల్సిందిగా మంత్రి గారిని క‌లిసి కోర‌డం జ‌రిగింది.-అని వారు వివరణ ఇచ్చారు. తాము ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ రూపొందించిన‌ట్లు స‌ద‌రు ప‌త్రిక‌లు రాశాయి. ఇది ప‌చ్చి అబ‌ద్ధం. తాము ఇంత‌వ‌ర‌కు ఎటువంటి కార్య‌చ‌ర‌ణ రూపొందించ‌లేదు. ఎలాంటి స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేదు. అస‌లు మా ఉద్దేశ్యం కూడా అది కాదు. మేము ఏనాడూ ప్ర‌భుత్వ విధానాల‌కు, ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకం కాదు, ఎప్పుడూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వెళ్ల‌లేదు అని వారు తమ వివరణలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనను జారీ చేసిన వారు-వి.ల‌చ్చిరెడ్డి, రాష్ట్ర‌ అధ్య‌క్షులు,డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌, తెలంగాణ‌, వంగా ర‌వీంద‌ర్ రెడ్డి, రాష్ట్ర అధ్య‌క్షులు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(ట్రెసా), కె.గౌత‌మ్ కుమార్‌, రాష్ట్ర అధ్య‌క్షులు, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ), ఉపేంద‌ర్ రావు, రాష్ట్ర అధ్య‌క్షులు, గ్రామ రెవెన్యూ ఉద్యోగుల(వీఆర్వో) సంఘం, ఈశ్వ‌ర్‌, రాజ‌య్య‌, రాష్ట్ర అధ్య‌క్షులు, వీఆర్ఏల సంఘం.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండు పత్రికలతో రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయిన సంతోష్ కుమార్ కు సంబంధం ఉందనే విషయం అందరికి తెలుసు. ఈ రెండు పత్రికలలో ఒక దానిలో ఆయన నేరుగా పెట్టుబడులు పెట్టారని, మరో పత్రికలో తెర వెనుక నుంచి పెట్టుబడి పెట్టారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా మంత్రి ఈటలను టార్గెట్ చేస్తూ ఈ రెండు పత్రికలలో వార్తలు రావడంతో ఒక్క సారిగా రాజకీయ వర్గాలు విస్తుపోయాయి.

ఈటల ను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు సంతోష్ ఈ విధంగా రాయించారని కొందరు ఊహించుకున్నారు. మరి కొందరైతే చంద్రబాబు గతంలో ఇలానే మంత్రులను వదిలించుకోవాలంటే తనకు అనుకూలమైన పత్రికలలో రాయించి బద్నాం చేసి తీసేసేవాడని, ఇప్పుడు కేసీఆర్ కూడా అలానే తనకు ఆప్తుడైన సంతోష్ కుమార్ కు చెందిన పత్రికలలో రాయించి ఈటలను బద్నాం చేసి మంత్రి వర్గం నుంచి తీసేయబోతున్నాడని మరి కొందరు ఊహించుకున్నారు.

వాస్తవానికి సంతోష్ కుమార్ తాను ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టిన పత్రిక నుంచి ఏనాడో వైదొలగారు. మరో పత్రికలో ఆయన పెట్టుబడులు ఉన్న విషయం కరెక్టు కాదు. వెరసి ఆయన రాయించిన వార్త కాదని ఇప్పుడు తాజాగా తేలింది. ఈ వార్తలు మరి ఎవరు రాయించారు? ఎందుకు రాయించారు? ఇలా మంత్రి ఈటల రాజేందర్ తో బాటు పరోక్షంగా సంతోష్ కుమార్ ను తద్వారా కేసీఆర్ ను బద్నాం చేస్తున్నది ఎవరు అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.

కేసీఆరే రాయించదలచుకుంటే టాప్ వన్ పేపర్ లోనే రాయించేవాడని, ఇలా చిన్న పత్రికలలో రాయించరని మరి కొందరు అంటున్నారు. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తీసేసే అవసరం ఏమిటని కూడా మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ రెండో సారి గెలిచినపుడు ఈటలకు మంత్రి పదవి రాదని కొన్ని పత్రికలలో కొందరు రాయించారు. అయితే కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అంకిత భావంతో పని చేస్తున్న వ్యక్తి. పైగా కేసీఆర్ కు సన్నిహితుడు. అలాంటి ఈటల రాజేందర్ ను కేసీఆర్ ఇలా ఎందుకు బద్నాం చేస్తారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈటల ను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటే కేసీఆర్ కు ఒక్క క్షణం పని. అంతే కాదు ఈటల రాజేందర్ కూడా తిరుగుబాటు చేసే వ్యక్తి కాదు. పార్టీ అధినాయకుడు ఎలా నిర్ణయిస్తే అదే విధంగా నడచుకునే వ్యక్తి – ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసు.

మధ్యలో ఈ ప్లాంటెడ్ స్టోరీ ఏమిటి? దీనితో ఇటు ఈటలను, అటు సంతోష్ ను బద్నాం చేసిన శక్తులు ఏమిటి అనే విషయాలను బయటపెట్టాలని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Related posts

ఘనంగా ములుగు పోలీసుల సురక్ష దివస్ ర్యాలీ

Satyam NEWS

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

నన్ను మోడీ రమ్మనలేదు: నేనే మోడీని రమ్మన్నాను

Satyam NEWS

Leave a Comment