ఒక వాహన షోరూమ్ వారు పిల్లలకు ఒక హైస్పీడ్ బైక్ అమ్మారు. ఆ పిల్లలు బైక్ కొనే విషయం పెద్దలకు చెప్పలేదు. ఆ బైక్ తో వారు వెళ్లి ఒక వ్యక్తిని ఢీ కొన్నారు. అతను మరణించాడు. ఈ యాక్సిడెంట్ కు కారణం ఎవరు? బాధ్యత లేకుండా హైస్పీడ్ బైక్ అమ్మిన షోరూం వారా? యాక్సిడెంట్ చేసిన పిల్లలా?
లక్ష రూపాయల బైక్ ను పిల్లలు కొంటున్నా తెలుసుకోకుండా బాధ్యతా రహితంగా ఉన్న వారి తల్లిదండ్రులా? ఎవరు కారణం? నాచారం సమీపంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన బాలుడు (17) తన సోదరుడు (19)తో కలిసి బేగంపేటలోని ఓ షోరూంలో సెప్టెంబరు 30న ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు.
దాని విలువ సుమారు రూ. లక్ష. హాస్టల్లో ఉంటున్న బాలుడు బైకును తన వద్దనే ఉంచుకున్నాడు. వారం కిందట అతడు బైక్ నడుపుతుండగా ఘట్‌కేసర్ సమీపంలో ఒక వ్యక్తిని ఢీకొట్టి అతడి మృతికి కారణమయ్యాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. అతడి తండ్రి, బంధువులు శనివారం వాహన షోరూంకు వచ్చి బైక్ ఎందుకు విక్రయించారని నిలదీశారు.
ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అక్కడికి వెళ్లిన తమపైనా బాలుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుళ్లు కూడా ఫిర్యాదు ఇచ్చారు.