రాంగోపాల్ వర్మ… ప్రతి నాయకులు అంటే… విలన్లను హీరోలుగా చిత్రీకరిస్తూ సినిమాలు తీయడంలో దిట్ట. అసలు నేర సామ్రాజ్యం నేపథ్యంగా సినిమాలు తీయడమంటే వర్మకు ఎంత ఇష్టమో ఆయన కెరీర్ ను చూస్తే ఇట్టే అర్థవుతుంది. అయినా ఇప్పుడు వర్మ గురించి ఇప్పుడెందుకు అంటారా?… ఏపీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సినీ దర్శకుడిగా వర్మ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది కదా. అరెస్ట్ నుంచి తప్పించుకుని వర్మ ఏకంగా పారిపోయారు కదా.
ఇంకా మొటుగా చెప్పాలంటే… పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయి కదా వర్మ. ఎన్ని సినిమాలు తీసినా… ప్రతి సినిమాలో నేరస్తులు పోలీసుల ముందు లొంగిపోతున్న కఠిన నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న దర్శకుల్లో ఒకరైన వర్మ… ఇప్పుడు అదే పోలీసుల నుంచి తాను తప్పించుకుని తిరుగుతున్న తీరుపై నిజంగానే పెద్ద పెద్ద చర్చలే జరుగుతున్నాయి. గడచిన రెండు రోజులుగా వర్మ పరారీలో ఉన్నారు. పోలీసుల నోటీసులకు తొలుత బాగానే స్పందించిన వర్మ… మలి విడత నోటీసులను ఊహించలేకపోయారు.
అందుకే తాను ఊహించన రీతిలో తన ఇంటి ముంగిట వాలిన పోలీసులను ఏమార్చిన వర్మ…ఎంచక్కా ఓ కరడుగట్టిన నేరస్తుడిగా తప్పించుకుని పారిపోయారు. సినిమాల్లో తన గ్రాఫ్ బాగా ఉన్నంత కాలం రాజకీయాలను పెద్దగా పట్టించుకోని వర్మ…, సినిమాల్లో తన పని అయిపోయిందని గ్రహించిన మరుక్షణమే ఆయన రాజకీయాలపై మాట్లాడటం మొదలుపెట్టారు. టీడీపీ అన్నా… ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నాఆది నుంచి వ్యతిరేక భావనతోనే సాగిన వర్మ… చంద్రబాబును, ఆయన బృందాన్ని తనకు ప్రత్యక్ష శత్రువులుగానే పరిగణించడం మొదలుపెట్టారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నా కూడా వర్మ ఒకింత వ్యతిరేక భావనతోనే ఉన్నారని చెప్పాలి. పవన్ నే కాకుండా యావత్తు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వర్మ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా వైఖరితో సాగుతున్న వర్మకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం మరింతగా కలిసి వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా జగన్ తనకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం వర్మను ఉబ్బితబ్బిబ్బు అయ్యేలా చేసిందని కూడాచ చెప్పాలి.
ఈ క్రమంలో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా 2019 ఎన్నికల తర్వాత పలు పోస్టులను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురు నేతలను కించపరచడంతో పాటుగా మార్ఫింగ్ ఫొటోలతో వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వర్మ పెట్టిన ఈ పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మద్దిపాడు పోలీసులు… వర్మపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ వర్మకు మద్దిపాడు పోలీసలు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించిన వర్మ… షూటింగుల బిజీలో ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు తనకుకొంత సమయం కావాలని కోరారు. వర్మ అభ్యర్థనకు సానుకూలంగానే స్పందించిన మద్దిపాడు పోలీసులు… 10 రోజుల పాటు ఆయనకు గడువు ఇచ్చి మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ దఫా కూడా తనకు మరింత సమయం కావాలని వర్మ కోరగా…అలాంటిదేమీ కుదరదని మద్దిపాడు పోలీసులు తెగేసి చెప్పారు.
అంతేకాకుండా వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడించారు. అయితే ఈ విషయాన్ని కాస్తంత ముందుగానే గ్రహించిన వర్మ… పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా పరారైపోయారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి మద్దిపాడు పోలీసులు వర్మ ఆచూకీ కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ముమ్మరంగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే… అరెస్ట్ నుంచి తప్పించుకుునేందుకు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరో వర్మకు సహకరిస్తున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్ననాయి.
వర్మను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వచ్చిన విషయాన్ని కూడా సదరు హీరోనే ఆయనకు చేరవేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే… ఎక్కడ దాక్కుంటే బాగుంటుందనే విషయాంలోనూ సదరు హీరో వర్మకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లుగా గుసగుసలు వినిసిస్తున్నాయి. మొత్తంగా వర్మను తప్పించే క్రమంలో సదరు హీరో ఏపీ పోలీసులకు టార్టెగ్ గా మారతారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే…అసలు వర్మ పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారన్న అంశంపై ఓ స్ట్రేంజి లాజిక్కులు వినిపిస్తున్నాయి. అరెస్ట్ అయితే వర్మకు ఏపీ పోలీసుల చేతిలో ధర్డ్ డిగ్రీ తప్పదని కొందరు చెబితే… వారి మాట నిజమో, కాదో కూడా తెలుసుకోకుండానే వర్మ భయపడిపోతున్నారని కొన్నివర్గాలు చెబుతున్నాయి. థర్డ్ డిగ్రీ అంటేనే హడలిపోతున్న వర్మ… హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… దానిపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ లెక్కన హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించేదాకా వర్మ పలాయనం ముగియదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.