37.2 C
Hyderabad
April 19, 2024 12: 33 PM
Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎవరు?

#apchiefsecretary

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆదిత్యానాథ్ దాస్ సెప్టెంబ‌ర్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

ఆదిత్యానాధ్ దాస్ కు మరో మూడు నెలలు పదవీ కాలం పొడిగించే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకు సుముఖంగాలేరని అంటున్నారు. ఆదిత్యానాథ్ దాస్ ముఖ్యమంత్రి అప్పగించిన కొన్ని పనులను చేయలేకపోతున్నారని తెలిసింది.

కేంద్రం నుంచి వచ్చే సమాచారం ముందుగా తెలుసుకోవడం, రాష్ట్రంలో వ్యవస్థలకు అధిపతులుగా ఉన్న వారిని అదుపుచేయడంలో ఆయన తాను ఆశించిన మేరకు పని చేయడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన పొడగింపునకు అంతగా సుముఖంగా లేరని అంటున్నారు.

దాంతో ఏపీ నూత‌న సీఎస్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌గా మారింది. సీఎస్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు అర్హ‌త క‌లిగిన అధికారుల జాబితా పెద్ద‌గానే ఉన్నా.. ఒకరికి మాత్ర‌మే అవ‌కాశం దక్కుతుంది. వైఎస్సార్ హ‌యాంలో వెలుగు చూసిన గనుల కుంభ‌కోణంలో ఏకంగా జైలు జీవితం గ‌డిపి త‌న కెరీర్ నే ప్ర‌మాదంలోకి నెట్టేసుకున్న మ‌హిళా ఐఏఎస్ వై.శ్రీల‌క్ష్మికి ఈ ప‌ద‌వి దక్కుతుందంటూ కొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఆమెకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడితే తీవ్రమైన వివాదం చెలరేగుతుందని ముఖ్యమంత్రి జగన్ కు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నందున కొత్త కేసు నెత్తినెత్తుకోవడం మంచిది కాదని కూడా వారు సలహా ఇస్తున్నారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న నీలం సాహ్నీ భ‌ర్త అజయ్ సాహ్నీ ప్రస్తుతం సీనియర్ గా ఉన్నారు. 1984 బ్యాచ్ కు చెందిన అజ‌య్ సాహ్నీ ప్ర‌స్తుతం కేంద్ర స‌ర్వీసుల్లో కొన‌సాగుతున్నారు. అజ‌య్ త‌ర్వాతి ప్లేసులో 1985 బ్యాచ్ కు చెందిన రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం, స‌మీర్ శ‌ర్మ‌లున్నా వీరి ప‌ట్ల జ‌గ‌న్ అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు.

ఇక 1986 బ్యాచ్ కు చెందిన స‌తీష్ చంద్ర కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న భావ‌న‌తో జ‌గ‌న్ ఈయ‌న‌ను చాలా కాలం ప‌క్క‌న‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత స‌తీష్ కు కీల‌క పోస్టింగ్ ఇచ్చిన జ‌గ‌న్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచేశారు. సతీష్ చంద్ర నవంబర్ లో రిటైర్ అవుతారు.

స‌తీష్ చంద్ర త‌ర్వాత స్థానాల్లో 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్, 1988 బ్యాచ్ కు చెందిన‌ వై. శ్రీల‌క్ష్మి, పూనం మాల‌కొండ‌య్య‌ల‌తో పాటు 1990 బ్యాచ్ కు చెందిన జ‌వ‌హ‌ర్ రెడ్డి ఉన్నారు.

జాబితాలో తొలి స్థానంలోని అజయ్ సాహ్నికి జ‌గ‌న్ ఓకే చెబితే స‌రేస‌రి.. లేదంటే జ‌గ‌న్ చూపు జ‌వ‌హ‌ర్ రెడ్డిపైనే ఉంటుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జ‌వ‌హ‌ర్ రెడ్డిని కూడా కాద‌నుకుని తాను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తెలంగాణ కేడ‌ర్ నుంచి ఏపీ కేడ‌ర్ కు రప్పించుకున్న వై.శ్రీల‌క్ష్మికి గ‌నుక జ‌గ‌న్ అవకాశం ఇస్తే.. అది ఏపీలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వార్త‌గా మారిపోయే అవ‌కాశాలు ఉన్నాయి.

Related posts

రెడీ టు యూజ్: కస్తూరిబా కళాశాల భవనం పనులు ప్రారంభం

Satyam NEWS

కరోనా కట్టడికి అందరూ కలసి రావాలి

Satyam NEWS

పి వి సింధు కు పతకం రావటంతో ఖమ్మంలో సంబురాలు

Satyam NEWS

Leave a Comment