ఆర్టీసీ కార్మికులు విధుల్లో రాకపోయినా ఆర్టీసీ నడుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తామని గగ్గోలు పెడుతున్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి రైల్వేలను ఎందుకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదో చెప్పాలని ఆయన అన్నారు. ప్రగతి భవన్ లో ఆర్టీసీ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి సిఎంకు ఆర్టీసీ సమ్మెపై నివేదికను అందచేశారు. పండుగ సమయంలో కుట్ర పన్ని ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేసినా దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చామని మంత్రి తెలిపారు. కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ప్రజలకు ఇబ్బందులను కలుగచేస్తున్నాయని మంత్రి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై నాలుగో తేదీన చెప్పిన ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు విధుల్లోకి రాకున్నా ప్రజా రవాణా సాఫీగానే సాగుతున్నదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 7358 వాహనాలను ప్రజల అవసరాల కోసం వాడుతున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీకి 71 లక్షల వాహనాలు తెలంగాణ విభజన సమయంలో ఉంటే ఇప్పుడు 1కోటికి పైగా పెరిగాయని, గతంలో ఎప్పుడూ పాల్గొనని టిక్కెటింగ్ ఉద్యోగులను సైతం సమ్మెలోకి తీసుకెళ్లారని మంత్రి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు
previous post