32.7 C
Hyderabad
March 29, 2024 11: 23 AM
Slider సంపాదకీయం

మూడు ముక్కలాటలో వైసీపీకి జాక్ పాట్

#BJP Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఏం జరుగుతున్నది? ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది అనుకుంటున్నారా? కరెక్ట్. మీరు అనుకుంటున్నదే కరెక్టు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలవడం తప్పా రైటా అన్న అంశం పక్కన పెడితే ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకూ ఒక్కరు కూడా స్పందించలేదు.

ఆ ముగ్గురు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో కలవడంపై అధికార వైసీపీ మధ్యాహ్నం నుంచి ఏపి బిజెపి పై వంటికాలితో లేస్తున్నది. తెలుగుదేశం పార్టీ తొత్తు పార్టీగా మారిపోయిందని విమర్శించింది. బిజెపిలో ఉన్న కమ్మ కులస్తులు బిజెపి కోసం కాకుండా తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని కులప్రస్తావన తెచ్చి మరీ తిట్టింది.

విజయ సాయి రెడ్డి అయితే నేరుగా బిజెపి నాయకులను దొంగలుగా ముద్ర వేస్తూ ట్విట్టర్ లో కామెంట్ కూడా చేశారు. వైసిపి నాయకుడు అంబటి రాంబాబు అయితే మరింత దురుసుగా మాట్లాడారు. అయితే బిజెపి మాత్రం నోరు మెదపడం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలవడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు బిజెపి డిఫెన్సులో పడిపోయినట్లే కనిపిస్తున్నది.

కిక్కురు మనని బిజెపి రాష్ట్ర నాయకులు

ఎన్నికల కమిషనర్ ను కలిస్తే తప్పేంటి అని బిజెపి నాయకులు ఎవరూ సమర్థించలేదు. అంతేకాదు కేంద్ర నాయకులు కూడా కిక్కురుమనడం లేదు. అంటే రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి తప్పు చేసినట్లుగా బిజెపి భావిస్తున్నదా? అంటే సమాధానం లేదు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో కో పిటిషనర్ గా ఉన్నారు.

ఈ విషయం పార్టీ అగ్ర నాయకత్వానికి తెలిపి వారి అనుమతితోనే తాను కోర్టు కేసు ఫైల్ చేసినట్లు ఆయన ఇప్పటికే పలు మార్లు స్పష్టంగా చెప్పారు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో బిజెపి సానుకూలంగా ఉందనుకోవాలా? మరి కేంద్ర నాయకత్వం సానుకూలంగా ఉంటే రాష్ట్ర బిజెపి నాయకులు ఉదయం నుంచి వైసీపీ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? తెలియదు.

అసలు ఆంధ్రప్రదేశ్ బిజెపిలో పైకి కనిపెంచకుండా రెండో మూడో గ్రూపులు పని చేస్తున్నట్లుగా ఉంది. ఒకటి తెలుగుదేశం అనుకూల వర్గం, రెండు వైసీపీ అనుకూలవర్గం మూడు జనసేన అనుకూల వర్గం. ఈ మూడు వర్గాలు అవసరాన్ని బట్టి రియాక్టు అవుతుంటాయి. అనుకోవాలి. అంతే.

ఈ గ్రూపుల గొడవల్లో పార్టీ మరింత కనిష్ట స్థాయికి దిగజారిపోతున్నది. కొసమెరుపు ఏమిటంటే నేడు జరిగిన పరిణామాలలో ఏ మాత్రం సంబంధంలేని తెలుగుదేశం పార్టీ మాత్రం జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ సమర్ధించుకుంటున్నది. ఎందుకో అర్ధం కాదు.

వారి నాయకులు కాదు, కలిసింది వారి రాష్ట్రంలో కాదు. వారిని వకాల్తా పుచ్చుకోమని ఎవరూ అడగనూ లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కలవడంలో ఎలాంటి తప్పు లేకపోయినా సమర్థించుకోవాల్సిన బిజెపి నిశ్చేష్టంగా మిగిలిపోవడం, సంబంధం లేని తెలుగుదేశం కడుపు చించుకోవడం వైసీపీకి రాజకీయ లాభాన్ని మిగిల్చాయి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్

Related posts

అజ్మీర్ దర్గా ఉర్సుకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్

Bhavani

ముళ్ల పొదల్లో… అపస్మారక స్థితిలో చేతులు కట్టేసి ఉన్న యువతి

Satyam NEWS

ఏపీ లో కూడా సెక్రటేరియేట్ కు వాస్తు మార్పులు

Satyam NEWS

Leave a Comment