30.7 C
Hyderabad
April 19, 2024 08: 25 AM
Slider జాతీయం సంపాదకీయం

సానుకూల స్పందనతో పరుపు నిలుపుకున్న కాంగ్రెస్

soniagandhi-1509818207

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్టు చేయడం మరొక ఎత్తు. ఆర్టికల్ 370 రద్దు ను వ్యతిరేకించి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకుని అయోధ్య భూ వివాదంపై వచ్చిన తీర్పును సంపూర్ణంగా, ఎలాంటి సంశయాలూ కూడా లేకుండా మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంచి నిర్ణయం. లేకుంటే ఈ సారి పార్టీ పరిస్థితి మరింత దిగజారి ఉండేదనడంలో సందేహం లేదు.

ఆర్టికల్ 370 రద్దు సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను బిజెపి తిప్పతి కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు కూడా బయటకు వెళ్లారు. ఆర్టికల్ 370పై బలమైన వాదనలు వినిపించిన సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, పి.చిదంబరం లాంటి వ్యక్తులు కూడా ఆ తర్వాత బిజెపి ఇచ్చిన కౌంటర్ తో ఏం మాట్లాడలేకపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిపోయింది. ఆర్టికల్ 370 రద్దు పై దేశవ్యాప్తంగా అనుకూల పవనాలు వ్యాపించిన వేళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి అభాసుపాలైంది.

ఈ నేపథ్యంలో అయోధ్య భూ వివాదంపై వచ్చిన తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. వాస్తవంగా అయోధ్య తీర్పు ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేందుకు రెండు మూడు అంశాలు బలంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం అటుగా మొగ్గలేదు. అందుకే కాంగ్రెస్ పై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విషం కక్కారు. కాంగ్రెస్ పార్టీ చనిపోవాలని ఒవైసీ కోరుకోవడం వెనుక ఆయన నిస్సహాయతతో బాటు కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయంలో తాను ఆశించిన రీతిలో స్పందించలేదనే కసి ఆయన మాటల్లో కనిపించింది.

దేశంలో ముస్లింలను ఆకట్టుకోవడానికి అయోధ్య తీర్పును వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒవైసీ ఆశించిన రీతిలో స్పందించకుండా మంచి నిర్ణయం తీసుకున్నది. దేశంలో చాలా కాలం పాటు ముస్లిం లను ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు భిన్నంగా బిజెపి నిర్ణయాలు తీసుకుంటే కేంద్రంలో వరుసగా రెండో సారి కూడా అధికారంలోకి వచ్చినందున కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయం సుస్పష్టం.

కేవలం ముస్లింల ఓట్ల కోసం మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బ తీయడం ఎంత వరకూ సబబు అంటూ బిజెపి వేసిన ప్రశ్నకు చాలా మంది ఆకర్షితులయ్యారు. గతంలో ఆర్ ఎస్ ఎస్ లో ఒక భావజాలం ఉండేది. అదేమిటంటే దేశంలో ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న ముస్లింలను ఆకట్టుకోకుండా అధికారంలోకి రావడం సాధ్యమా అనే చర్చ ఆర్ ఎస్ ఎస్ లో జరిగేది. ముస్లింలను ఆకట్టుకోకుండా అధికారంలోకి రావడం సాధ్యం కాదని, వచ్చినా ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఆర్ ఎస్ ఎస్ లోని ఒక వర్గం బలంగా వాదించేది.

ఆ స్థితి నుంచి తమ ఆలోచనా విధానాలను మార్చుకుంటూ వచ్చిన బిజెపి దేశంలో అధికారం సొంతం చేసుకున్నది. ఇప్పుడు బిజెపి ఆశించిన విధంగానే ముస్లింలు ఎక్కడా కూడా పెద్దగా ప్రతిఘటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒవైసీ లాంటి ఒకరిద్దరు నేతలు ముస్లింల వాయిస్ పేరుతో తమ సొంత అభిప్రాయాలను వినిపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం చెప్పిన విషయాలు కూడా తప్పు అని బిజెపి నిరూపించిన తర్వాత ఇక ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేక ఎజెండా అమలు చేసి రాజకీయ లబ్ది పొందాలనే సిద్ధాంతానికి సంపూర్ణంగా కాలం చెల్లినట్లే అయింది.

ఈ నేపథ్యంలో వచ్చిన అయోధ్య తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అందుకోసమే సానుకూలంగా స్పందించినట్లు గా భావించాలి. అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అయోధ్య తీర్పును వ్యతిరేకించ రాదు అనే నిర్ణయం తీసుకుని తన పరువు మరింతగా దిగజారకుండా చూసుకున్నది.

Related posts

అన్ని హామీలూ నెరవేరుస్తున్న మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Satyam NEWS

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిద్దాం

Bhavani

Leave a Comment