ఎన్నికల సమయంలో ప్రచారం పీక్స్‌లో ఉండగా.. వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతల గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్.. ఈ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐలు అని ఎద్దేవా చేసేవారు. వారు ఇక్కడ అతిథులు మాత్రమే అని ఆరోపించారు. తాను మాత్రం తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని పర్మినెంట్ గా కాపురం పెట్టానని చెప్పుకునేవారు. చంద్రబాబు, పవన్ లు ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండే నాన్ లోకల్స్ అని అనేవారు. కానీ, ఇప్పుడు ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్.. ఏపీకి గెస్ట్‌లా మారిపోయారు. తాడేపల్లిలో ఉండడం కన్నా.. కర్ణాటకలోనే అధికంగా ఉంటున్నారు. బెంగళూరు యలహంకలో తనకు ఉన్న ప్యాలెస్ కు వెళ్లి ఉంటున్నారు జగన్.
అయితే, జగన్ తరచూ బెంగళూరుకు ఎందుకు పరుగులు పెడుతున్నారు..? ఎందుకు ఆయన పదే పదే కర్నాటకకి వెళుతున్నారనే అనుమానాలు వైసీపీ నేతల్లో కూడా కలిగాయి. దాంతో వారు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే, తాడేపల్లిలో ఉంటే జగన్ వ్యూహాలు ఇట్టే బయటికి లీక్ అవుతాయనే భయంతో కూడా జగన్ బెంగళూరులో ఉంటున్నారని అంటున్నారు. తాడేపల్లిలో ఉంటే ఎవరైనా వచ్చి తనను కలిస్తే మీడియా లేనిపోని రాద్దాంతం చేస్తుందని భావించి బెంగుళూరులో మకాం పెడుతున్నారని జగన్ భావిస్తున్నారట.
అందుకే, రాబోయే ఐదేళ్లు ఎక్కువకాలం జగన్ బెంగుళూరులోనే గడుపుతారని అంటున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు.. ఏవైనా ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడు.. బెంగళూరు నుంచి ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు మీడియా ముందు చెప్పేసి వెళ్లిపోతారని అంటున్నారు. దీనికితోడు గతంలో జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాలను కూటమి సర్కార్ విచారణ చేయించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అని భావించి.. ముందుగానే జగన్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
2019-24 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పాలనలోనూ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. అందుకని ఏ సమయంలో ఎటు నుంచి ఏ కేసు వచ్చి మీద పడుతుందో అని జగన్ భయపడిపోతున్నారు. అందుకే జగన్ రెడ్డి బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ పెద్దలతో జగన్ కు మంచి పరిచయాలు ఉన్నందున.. తనకు ఈడీ, సీబీఐ అరెస్టులు లాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాబోవని ధీమాతోనే అక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. జగన్ పరిస్థితిని గమనించిన కూటమి నేతలు ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.