పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ పేరెందుకు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేరు పెట్టడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డి కె అరుణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ లో జైపాల్ రెడ్డి పాత్ర ఏముందో చెప్పాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ల కోసం కొట్లాడింది మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి గారు కాదా. ఈ ప్రాజెక్టు కోసం అయిన పడిన ఆవేదన నాకింకా గుర్తుంది. పాలమూరు రంగారెడ్డి తోనే నా పార్లమెంటు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది అని చిట్టెం నర్సిరెడ్డి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కోసం సర్వే జీవో ఇప్పించిందే నేను కదా. రాయలసీమ నేతలు ఎంత వద్దన్నా పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డికి జీవో తెప్పించా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఆ రోజు టీడీపీలో ఉండి వ్యతిరేకించింది ఇదే రేవంత్ రెడ్డి కాదా..? అని అరుణ ప్రశ్నించారు.
ఏం అర్హత ఉందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జైపాల్ రెడ్డి పేరు పెడతారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర ఏముందని దానికి ఆయన పేరు పెడతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని నేను ఖండిస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న ప్రాజెక్టుకు మా సంప్రదింపులు లేకుండా ఎలా పేరు పెడతారు? అంత చిత్తశుద్దే ఉంటే.. కేంద్ర మంత్రి గా ఉన్న జైపాల్ రెడ్డి పాలమూరు కు జాతీయ హోదా ఎందుకు తేలేదు? పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు వచ్చింది..? పాలమూరు కు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరుతున్నా అని ఆమె అన్నారు.