పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రాజకీయ రాద్దాంతం తగదని, ఇది టీ కప్పులో తుఫాన్ వంటిది అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే నాయకులు, అర్జున్ అరెస్టును చిలికి చిలికి గాలి వానగా మారుస్తున్నారని ఆరోపించారు. బయటి కొచ్చిన అర్జున్ తాను చట్టాన్ని గౌరవిస్తాను అంటుంటే, నేను సేఫ్ అంటుంటే, కొన్ని రాజకీయ పార్టీలు తెగ బాధ పడిపోతున్నాయని చెప్పారు. తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఒక మహిళ మృతి చెందిందని, ఆమె బిడ్డ ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడని గుర్తు చేశారు. చట్టానికి అల్లు అర్జున్ మాత్రమే తెలుసు అని, పుష్ప రాజ్ తెలియదని అభివర్ణించారు. ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి 34 రోజులు జైల్లో పెట్టిన సంఘటన, కోడి కత్తి కేసులో ఐదు సంవత్సరాల ఐదు మాసాలు బెయిల్ కూడా ఇవ్వని సంఘటన, రాజధాని కోసం భూములు ఇస్తే, కేసులు పెట్టి జైలుకు పంపిన సంఘటనలను నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలని బాలకోటయ్య కోరారు.
previous post
next post