27.7 C
Hyderabad
April 20, 2024 01: 46 AM
Slider సంపాదకీయం

టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ: అసలు కథ ఏమిటి?

#jagan

గత అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడికి ‘‘రిటర్న్ గిఫ్ట్’’ ఇవ్వడానికి ఎంతో చక్కగా కలిసిమెలిసి పని చేసిన టీఆర్ఎస్, వైసీపీ ఇప్పుడు పాము ముంగీస తరహాలో కొట్లాడుకుంటున్నాయి. తెలంగాణ లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు, ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీకి మధ్య ఇంతలా సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వస్తున్నాయి.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అన్ని హంగులు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నింటిని కలుస్తున్నారు. కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీని సవాల్ చేసే వేదిక లేదని అందుకు టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కావాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు, సంధిస్తున్న విమర్శలు బీజేపీకి కోపం తెప్పిస్తున్నాయి. దేశంలో అన్ని తటస్థ రాజకీయ పార్టీల నాయకులను కలుస్తున్న కేసీఆర్ ఇప్పటి వరకూ ఆంధ్రా సీఎం జగన్ ను బహిరంగంగా కలిసి మాట్లాడలేదు. తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బహిరంగంగా కూడా కోరలేదు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ను కొందరు ప్రశ్నిస్తున్నా ఆయన సమాధానం చెప్పడం లేదు.

ఆంధ్రాలో ఈ అంశం మాట్లాడే సాహసం ఎవరూ చేయడం లేదు. దాంతో చిరకాల మిత్రులైన టీఆర్ఎస్, వైసీపీ ల మధ్య ఏం జరుగుతున్నదనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కోరుతున్నా జగన్ ఒప్పుకోవడం లేదని కొందరు అంటుండగా బీజేపీకి బీ టీమ్ లాగా ఉన్న ఏపీ సీఎం జగన్ కేసీఆర్ తో ఎందుకు మాట్లాడతారని మరి కొందరు అంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆంధ్రా మంత్రులు ఒక్క సారిగా ఆరోపణలు గుప్పించారు.

‘‘వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’’ అంటూ హెచ్చరికలు గుప్పించారు. దాంతో మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలకు ‘‘సారీ’’ చెప్పారు. అంతటితో ఆ వివాదం సర్దుమణిగింది. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రా టీచర్ల పే స్కేళ్ల గురించి మాట్లాడటంతో ఆంధ్రా మంత్రులు మళ్లీ ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మంత్రి బొత్సా సత్యనారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి తమ వద్ద ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో హరీష్ రావు వచ్చి స్వయంగా తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఏపి మంత్రులు మరి కొద్ది మంది హరీష్ రావును అత్యంత హేయమైన భాషలో తూలనాడారు. మామ (తెలంగాణ సీఎం కేసీఆర్) తో ఇబ్బందులు ఉంటే అల్లుడు (మంత్రి హరీష్ రావు) ఆయనతో తేల్చుకోవాలి కానీ ఆంధ్రా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

ఇది చాలా పెద్ద వ్యాఖ్య. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమే కాకుండా కేసీఆర్ కుటుంబ వ్యవహారం. ఇంత సీరియస్ వ్యాఖ్య చేయాల్సిన అవసరం వైసీపీకి లేదు. కానీ చేశారు. అదే విధంగా మంత్రి అమర్ నాథ్ అయితే మరిన్ని కఠినమైన వ్యాఖ్యల్ని చేశారు. దీనికి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఘాటైన సమాధానం ఇచ్చారు. మామా అల్లుడు అంటూ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన కరాఖండిగా చెప్పారు.

దీనిపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. రాజకీయాల్లో ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారని స్పష్టం చేశారు. మాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను మంత్రి గంగుల ఉపసంహరించుకోవాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో ఇరు పార్టీలూ ఇంత దూరం వెళ్లడం రాజకీయ పరిశీలకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకాలం కలిసి పని చేసిన టీఆర్ఎస్, వైసీపీలు ఇప్పుడు ఇలా కొట్టుకోవడం ఏమిటనే చర్చ తీవ్ర స్థాయికి చేరింది. ఈ మొత్తానికి కారణం బీజేపీ ‘‘గేమ్ ప్లాన్’’ అని కొందరు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం రోజువారీ అప్పులు చేస్తున్నా అదే మని అడగడం లేదు కానీ తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది.

తెలంగాణకు ఆర్ధిక వెసులుబాటు లేకుండా చేస్తున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ పైకి వైసీపీని బీజేపీ రెచ్చగొడుతున్నదని మరి కొందరు అంటున్నారు. బీజేపీ ప్రాపకం కోసం వైసీపీ నాయకులు గత ఎన్నికలలో తమకు పూర్తిగా సహకరించిన టీఆర్ఎస్ పైనే కత్తిదూయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Related posts

వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

Bhavani

జూపల్లి సమక్షంలో టిఆర్ఎస్ లోకి కల్వరాల నరసింహ

Sub Editor

ఒకే కుటుంబంకు చెందిన నలుగురు హత్య

Bhavani

Leave a Comment