కొన్నినెలల క్రితం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పాకిస్తాన్ చేతికి చిక్కిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అహ్మద్ ఖాన్ అనే కమాండో పాకిస్థాన్ లో హీరో అయ్యాడు. పాకిస్థాన్ సైన్యంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోగా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ ఖాన్ తమ భూభాగంలో అడుగిడిన అభినందన్ ను పట్టుకున్నాడు. దాంతో పాకిస్థాన్లో అహ్మద్ ఖాన్ కు నీరాజనాలు పలికారు. ఇప్పుడా అహ్మద్ ఖాన్ ను భారత సైన్యం అంతమొందించింది. ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించే క్రమంలో అహ్మద్ ఖాన్ హతమైనట్ల రక్షణ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభినందన్ నడిపిన ఐఏఎఫ్ జెట్ పాక్ సరిహద్దు వద్ద కూలడంతో ఆయన పాక్ సైన్యానికి పట్టుబడటం.. ఆయనను శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేయడం జరిగింది. అహ్మద్ ఖాన్ పాక్ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. భారత్ – పాక్ సరిహద్దులో పాక్ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్ ఖాన్ కీలకంగా వ్యవహరించేవాడు. దీంతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన సుశిక్షితులైన ఉగ్రవాదులను ఉపయోగించి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారం. చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్ సెక్టార్‌లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. అభినందన్ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్ ఆయన వెనుకే ఉన్నాడు.
previous post
next post