ఏపీ లో ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే నేరుగా జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88వేల 872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ.. లైసెన్సులు లేకుండా బండి నడిపే వారిని జైలుకు పంపాలని రవాణాశాఖకు సూచించింది. దీంతో ఏపీ రవాణాశాఖ కఠిన చర్యలకు రెడీ అవుతోంది. 2020లో రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నారు.
మరోవైపు లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం విద్యార్హతను తొలగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే 8వ తరగతి నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు పొందడం మరింత ఈజీ కానుంది.