రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వాళ్లపై పోలీసు జులుం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు.
తమకు అన్యాయం జరిగిందని శాంతియుతంగా ఆందోళనలు చేసే వారిని బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా విచక్షణా రహితంగా హింసించడం అమానుషమన్నారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రం లో పోలీసు పాలన సాగుతుందని స్పస్టమవు తుందన్నారు. అరెస్ట్ సందర్బంగా పోలీసులు ప్రదర్శించిన తీరు సభ్య ప్రపంచం సిగ్గుపడుతుందన్నారు.
అహింసా మార్గంలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల దమన కాండ యావత్ రాష్ట్రాన్ని భయాందోళనలకు గురిచేసిందన్నారు. రాష్ట్రం లో ఏకపక్ష పాలన సాగుతుందని తిరుపతి నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలని తిరుపతి నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.