టిఆర్ఎస్ తొలి నాటి నుంచి మంత్రి పదవుల్లో ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అనే మాట మరిచిపోయింది. ఇప్పుడు గవర్నర్ తమిళసై పుణ్యమాఅని కాబోలు మహిళకు తెలంగాణ రాష్ట్రంలో విశేష ప్రాధాన్యత వస్తున్నది. అడవారికి అధికారం లేని దుస్థితి దాపురించిన తెలంగాణలో ఒకే రోజులో ఎంత మార్పు? అతివకు అసలు ప్రాధాన్యత లేని రాష్ట్ర రాజకీయ యవనికలో ఆమెకు ఇప్పుడు అగ్రస్థానం దక్కింది. కీలక పదవుల్లో వారు ఆశీనులయ్యారు. నిన్నటి దాకా మహిళలకు ప్రాధాన్యత దక్కలేదన్న తెలంగాణలో ఇక మహిళలకు పదవుల వర్షం కురువనుంది.
రానున్న రోజుల్లో మరిన్ని కీలక పదవుల్లో అతివలకు అగ్రస్థానం రాష్ట్ర సర్కార్ కట్టపెట్టనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం సాకారమయి మొదటి తెలంగాణ సర్కార్‌లో మహిళలకు ప్రాధాన్యత కరువయింది. దీనిపై ముఖ్యమంత్రి కెసీఈర్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన ఆయన తన మొదటి మంత్రి వర్గంలో సైతం మహిళలకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో విమర్శలు చెలరేగాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా ఏనిమిదినెలలుగా తన పాలన కొససాగించారు. తెలంగాణ లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌గా మహిళను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అలోచనల్లో పడ్డారు.
రాన్నున్న రోజుల్లో మహిళలకు ప్రాధాన్యత లేదనే అంశంతో తమను ఇబ్బందులలో పెట్టె అవకాశముందని గ్రహించిన కెసిఆర్ అఘామేఘాల మీద అదివారం మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులుగా సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణం స్వీకారం చేశారు. ముందు రోజే విఫ్ గోంగడి సునితను నియమించి మరో మహిళకు క్యాబినెట్ ర్యాంకు పదవి కట్టబెట్టారు. ఇకరానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షురాలిగా కెసిఆర్ తన కుమార్తె కవితను నియమించుకునే అవకాశముంది.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కెబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చే అవకాశముంది. ఇదే జరిగితే తెలంగాణలో టిఆర్‌ఎస్ నుండి గెలిచిన అందరు మహిళ ఎమ్మెల్యేలకు మంచి పదవులే ఇచ్చినట్లవుతుంది. అలాగే అర్టీసి చైర్మన్‌గా కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా ను నియమించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు నామినేటేడ్ పదవుల్లో పార్టీకి సహకరించిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలియడంతో మహిళ నేతల్లో అనందం వ్యక్తం అవుతుంది.