39.2 C
Hyderabad
April 23, 2024 15: 57 PM
Slider ప్రత్యేకం

అన్నా చెల్లెలు మధ్య అగాధం: విడివిడిగా నివాళి…. రాజకీయ వేడి

#ysvijayalaxmi

వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహణతో వై ఎస్ కుటుంబంలో అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుమార్తె వై ఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వై ఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయలక్ష్మి తన వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె కుమారుడు పెట్టిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండగా ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి కుమార్తె షర్మిల పెట్టిన వైఎస్ఆర్ టిపి కి గౌరవాధ్యక్షురాలుగా రాబోతున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు షిఫ్ట్ అవుతున్న దశలో విజయలక్ష్మి వై ఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ కు మార్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎ‌స్‌ఆర్ సతీమణీ విజయలక్ష్మి అనుకుంటున్నారు. వైఎస్‌ఆర్ వర్థంతి ప్రతి ఏటా ఇడుపుల పాయలో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఇటీవల జరిగిన వైఎస్ జయంతి నాడు ఉదయం షర్మిల.. సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు ఎదురు పడకుండా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. ఈ సారి వర్థంతికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. సిమ్లా టూర్‌లో ఉన్న జగన్ తిరిగి వచ్చిన తర్వాత కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. రెండో తేదీన వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అదే రోజున హైదరాబాద్‌ వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

నాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌తో కలిసి పని చేసిన వారందరికీ ఆహ్వానాలు పంపారు. కేబినెట్ మంత్రులు… వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతలందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసి నివాళులు అర్పిస్తారా లేక షర్మిలతో కలిశా అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల తాడేపల్లి వచ్చిన విజయలక్ష్మి జగన్మోహన్ రె్డ్డి ఇంట్లో మూడు రోజులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాతనే ఆమె వైఎస్ వర్థంతి రోజున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ సమావేశం రహస్యంగా ఏమీ జరగడం లేదు. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ కన్వెన్షన్‌హాల్‌లోనే నిర్వహిస్తున్నారు. వైఎస్ పన్నెండో వర్థంతి సందర్భంగా నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెబుతున్నారు కానీ.. అటు షర్మిల కానీ ఇటు జగన్ ప్రమేయం కానీ లేకుండా ఇలాంటి సభలు .. సమావేశాలు విజయలక్ష్మి నిర్వహించరన్న అంచనా కూడా ఉంది. ఎవరి ప్రోద్భలంతో.. ఏ ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారో క్లారిటీ లేదు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా ఏకమయ్యే ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయన్న అభిప్రాయం మాత్రం కొంత మందిలో వినిపిస్తోంది.

హైదరాబాద్ సమావేశానికి వైఎస్‌ఆర్‌తో అనుబంధమున్న ప్రముఖులను ఆహ్వానించారు. 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో ప‌నిచేసిన ఉభ‌య రాష్ట్రాల మంత్రుల‌కు విజ‌య‌లక్ష్మి ఫోన్ చేసి ఆహ్వానించారు. వీరిలో వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా ఉన్నారు. బొత్సతో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అని మంత్రులు, వైసీపీ శాసనసభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రధానంగా మంత్రుల్లో ఈ భయం బాగా కనిపిస్తోంది. వర్ధంతి సభకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ తనకూ అందిందని.. అయితే విజయలక్ష్మి నేరుగా ఆహ్వానించలేదని ఓ మంత్రి తెలిపారు. నేరుగా పిలిస్తే వెళ్లాలో వద్దో అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. మిగతా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఇది రాజకీయ కార్యక్రమం కాదని, అందరూ రావాలని విజయలక్ష్మి కోరారు. అయితే ఆమె ఆహ్వానించారని వెళ్తే.. వైసీపీ, షర్మిల పార్టీ రెండూ ఒకటేనన్న సంకేతాలు వెళ్తాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రాంతంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ పెట్టడంలోను, ఆమె సభల నిర్వహణలోనూ విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌ను మరోసారి స్ఫురణలోకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా నిర్వహిస్తుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షర్మిల.. కార్యక్రమం నిర్వహణలో తన వంతు కీలక పాత్రనూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

Related posts

ఏసిబి వలలో బాన్సువాడ రూరల్ సిఐ టాటా బాబు

Satyam NEWS

న్యూ ఫైండింగ్: ఢిల్లీ అల్లర్ల వెనుక ఉగ్రవాదుల హస్తం

Satyam NEWS

క‌రోనా త‌గ్గిన వారు కూడా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి

Satyam NEWS

Leave a Comment