37.2 C
Hyderabad
March 29, 2024 18: 58 PM
Slider సంపాదకీయం

పవర్ వార్: కేంద్రంలో ఢీ కొడుతున్న జగన్ ప్రభుత్వం

#Nirmala Seetaraman

రాష్ట్రంలో పరిపాలనా పరంగా జరుగుతున్న అవకతవకలపై కేంద్రం దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఆంధ్రా జన సంవాద్ పేరుతో నిన్న నిర్వహించిన వర్చువల్ ర్యాలీ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రెండు అతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అందులో ఒకటి బయట దేశాల నుంచి అప్పులు తెచ్చి నిర్మించే ప్రాజెక్టులను కారణం ఏదైనా ఆపరాదని కేంద్ర ఆర్ధిక మంత్రి హితవు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి విదేశీ రుణాలతో నడిచే చాలా ప్రాజెక్టులు కుంటినడక నడుస్తున్నాయి. దీనిపై ఆమె దృష్టి సారించి ఓవర్సీస్ ( విదేశాల నుంచి) అప్పులకు కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నదని, అందువల్ల దేశప్రతిష్టతో ఇవి ముడిపడి ఉంటాయని అన్నారు.

వ్యక్తిగత కారణాలతోనో, రాజకీయ కారణాలతోనో అలాంటి ప్రాజెక్టులను నిలుపుదల చేయడం లేదా నెమ్మదిగా పనులు చేయడం వల్ల దేశానికి నష్టమని ఆమె ఒక విధంగా తీవ్ర హెచ్చరిక చేశారు. ఇక రెండో అంశానికి వస్తే తాము  అత్యంత చౌకగా ఇస్తున్న విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ 9 రూపాయలకు అమ్ముకుంటున్నది అనేది. ఇది కూడా జగన్ ప్రభుత్వానికి నేరుగా దెబ్బ తగిలే విషయమే.

చంద్రబాబునాయుడి హయాంలో 24 గంటల విద్యుత్ అనేది దేశంలోనే తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. పీయూష్ గోయల్ ఆ ప్రాజెక్టును ప్రారంభించి వెళ్లారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు 24 గంటల విద్యుత్ సరఫరా వైపు అడుగులు వేశాయి. ఆ ప్రాజెక్టులో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కేంద్రం విద్యుత్ ను రాష్ట్రానికి సరఫరా చేస్తున్నది. నిర్మలా సీతారామన్ విద్యుత్ టారిఫ్ పై చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి.

కేంద్రంతో ఢీ అనడానికి జగన్ సర్కార్ రెడీ

దాంతో ముఖ్యమంత్రి సలహాదారుడు అజేయ కల్లాం వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. విద్యుత్ టారిఫ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించింది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం అవాస్తవమని అజేయ కల్లాం అన్నారు. ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోందని, వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్‌మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు.

పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్‌మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోంది అంటూ అజేయ కల్లాం తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి ఇంత ఘాటుగా పాలనా పరమైన వ్యవహారాలపై వ్యాఖ్యలు రావడం ఇదే మొదలు. దీనితో జగన్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనాపరమైన తప్పిదాలపై కేంద్రం సీరియస్ గానే ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పడం చూస్తుంటే కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడినట్లుగా భావించాల్సి ఉంటుంది.

Related posts

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

Satyam NEWS

అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

Murali Krishna

Leave a Comment