28.2 C
Hyderabad
April 20, 2024 11: 19 AM
Slider సంపాదకీయం

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

#yssharmila

తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్ర పన్ని చంపారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల నేడు చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనపై తెలంగాణ లో పర్యటిస్తున్న షర్మిల తాజాగా మళ్లీ ఎందుకు వెలుగులోకి తెస్తున్నారనేది కూడా చర్చ జరుగుతున్నది.

వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్రపన్ని చంపారని షర్మిల ఎందుకు ఆరోపిస్తున్నారు? ఇటీవల పాదయాత్రలో షర్మిల తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డిని తూలనాడారు. దానికి మనస్తాపం చెందిన మంత్రి తన సహచరులతో కలిసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. మంత్రి మరి కొందరు ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుపై స్పీకర్ ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడి కాలేదు కానీ నేడు షర్మిల మీడియాతో మాట్లాడుతూ ‘‘కేసీఆర్ నీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకో’’ అంటూ సవాల్ విసిరారు.

డమ్మీ సంకెళ్లు చూపిస్తూ ‘‘పులి బిడ్డను ఈ సంకెళ్లు ఆపలేవు’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. అంతే కాదు తెలంగాణ పోలీసులను కూడా అత్యంత హీనంగా, న్యూనత పరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చెబుతూ ఆమె, 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్ర పన్ని చంపారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

ఆమె చేసిన ఆరోపణల క్రమం చూస్తే టీఆర్ఎస్ పార్టీ నే రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది అనే అభిప్రాయం వచ్చేలా ఆమె హావభావాలు ప్రదర్శించారు. వై ఎస్ మరణ సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలడం వల్ల అప్పటికి నెమ్మదించినట్లు కనిపించినా తెలంగాణ సెంటిమెంటు తీవ్ర స్థాయిలోనే ఉన్నది.

ఈ దశలో మరణించినందున టీఆర్ఎస్ హత్య చేయించిందనేది షర్మిల అభిప్రాయమా? లేక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చేయించిందా? లేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాల కారణంగా హత్య చేయించిందా? వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వై ఎస్ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వై ఎస్ కుటుంబ సభ్యులే వై ఎస్ రాజశేఖరరెడ్డి ని హత్య చేయించారా?

ఈ నాలుగు ప్రధాన ప్రశ్నలు కాగా అంబానీలు కుట్రపన్ని తన తండ్రిని హత్య చేయించారని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఆ కోణం ఏదైనా ఉన్నట్లు షర్మిలకు అనుమానమా? ( ఆ తర్వాతి కాలంలో అంబానీ సిఫార్సు చేసిన వ్యక్తికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సీటు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి)

అప్పటిలో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఎవరూ అనుమానించలేదు కానీ అనుమానాల నివృత్తి కోసం అప్పటి ముఖ్యమంత్రి కె రోశయ్య కేసును సీబీఐకి అప్పగించారు. ఆర్ కె త్యాగి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల బృందం కూడా రాజశేఖరరెడ్డి ప్రమాద మృతిపై కూలంకషంగా విచారణ జరిపింది.

సీబీఐ చేసిన విచారణలో దీనికి సంబంధించి ఎలాంటి కుట్ర లేదని విస్పష్టంగా తేలింది. నేషనల్ ఎయిరో స్పేస్ లాబెరెటరీస్, బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్, హైదరాబాద్, న్యూఢిల్లీ, చండీగఢ్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబోరెటరీస్, రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జెఎన్టియు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ జెన్ టెక్నాలజీస్ లాంటి సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సీబీఐ విస్త్రతంగా విషయ సేకరణ జరిపింది కూడా. గ్రూప్ కెప్టెన్ ఎస్ కె భాటియా ఆ హెలికాప్టర్ కు కెప్టెన్ గా ఉండగా ఎం ఎస్ రెడ్డి కో పైలెట్ గా ఉన్నారు. (వారిద్దరూ కూడా ప్రమాదంలో మరణించారు)

బేగంపేట విమానాశ్రయం నుంచి ఆ రోజు ఉదయం 8.38కి బయలు దేరిన హెలికాప్టర్ 94.1 నాటికన్ మైళ్లు ప్రయాణం చేసిందని ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్న రాడార్ తో కనెక్షన్ కోల్పోయిందని సీబీఐ చెప్పింది. వాతావరణం బాగాలేకపోయిన విషయం పైలెట్ కు కో పైలెట్ కు తెలిసినా వారు ఎందుకో గానీ ముందుకే వెళ్లారు తప్ప వెనక్కి రావడం గానీ సమీప సురక్షిత ప్రదేశంలో నిలుపుదల చేయడం కానీ జరగలేదు.

దట్టమైన అటవీ ప్రాంతం అయినందున నక్సలైట్ల పాత్ర ఏమైనా ఉందనే విషయం పై కూడా లేదని సీబీఐ తేల్చి చెప్పింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని స్వయంగా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలే ఎందుకు చర్చనీయాంశం చేస్తున్నారు? కుట్ర కోణం ఉందని చెబుతున్న షర్మిల ఆ కుట్రకు బాధ్యులు ఎవరో కూడా బహిరంగంగా ప్రకటించాలి.

టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారా? కాంగ్రెస్, తెలుగుదేశం లపై ఆరోపణ చేశారా లేక కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారా అనే విషయాన్ని షర్మిల స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు విచారణ జరిపించే అంశం కాదు. త్యాగి బృందం, సీబీఐ విచారణ చేసి కుట్ర కోణం లేదని తేల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వగానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ తాజాగా మళ్ళీ విచారణ జరిపించే అవకాశం లేదు.

అందువల్ల కుట్ర ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో షర్మిల విస్పష్టంగా తనకు తెలిసిన సమాచారం బహిరంగంగా మళ్లీ మీడియా ముందు చెప్పాలి. రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానాలు రేకెత్తించి (సీబీఐ విచారణ తర్వాత కూడా) రాజకీయంగా లబ్ది పొందాలని గతంలో జరిగిన ప్రయత్నాలు మళ్లీ మొదలు పెడితే తెలంగాణ ప్రజలు హర్షించరు.

Related posts

కాంగ్రెస్ ను గెలిపించిన అన్నా చెల్లెలు

Satyam NEWS

ఉపాధి హామీ పై పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభం

Bhavani

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

Satyam NEWS

Leave a Comment