28.7 C
Hyderabad
April 24, 2024 04: 14 AM
Slider సంపాదకీయం

ఒంటరినయ్యాను… కన్నీరు ఆగనంటోంది…..

#sharmila

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. ఇది నిన్న తండ్రి వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య. అధికారంలో ఉన్న మీ అన్నయ్య మిమ్మల్ని చూడకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారని ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆంధ్రాలో అన్నపై కోపంతో తెలంగాణ వచ్చి పార్టీ పెట్టిన వై ఎస్ షర్మిలకు రాజకీయంగా అంతగా కలసి రావడం లేదనేది స్పష్టం.

కాంగ్రెస్ పార్టీ కుదేలైపోతుందని వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి స్వీకరించిన తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు ఆగిపోయాయి. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ను చీల్చే స్థాయికి ఇంకా కాంగ్రెస్ పార్టీ రాకపోయినా తన ఓట్ బ్యాంకును కాపాడుకునే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఇక బతికి బట్ట కట్టదు అనుకున్న రెడ్డి కులస్తులు పక్క దారులు వెతుక్కున్నారు.

చాలా మంది టీఆర్ఎస్ లో రాజీపడి బతుకుతుండగా మరి కొందరు బిజెపిలో చేరారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రెడ్డి కులస్తులు పక్కదోవ చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంకు రెడ్లు, దళితులు. దళితుల్లో కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్లను టార్గెట్ చేసుకుని, రెడ్డి నాయకులను దారికి తెచ్చేసుకుంటే సునాయాసంగా బిజెపిని క్రాస్ చేయవచ్చుననే అంచనాతో షర్మిల తెలంగాణ లో రాజకీయ పార్టీ ప్రారంభించేశారు.

రెడ్లకు రేవంత్ రెడ్డి రాకతో అడ్డుకట్ట పడటంతోబాటు ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన దళితులు, వారితో బాటు కర్వర్టెడ్ క్రిస్టియన్లు, ఇతర బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు.

ఆయనకు అండగా బహుజన సమాజ్ పార్టీ ఉండటంతో ఓ ఓట్ బ్యాంకు షర్మిలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పగ్గాలు చేతికి చిక్కడం, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఆరంగేట్రం చేయడం ముందుగానే ఊహించి ఉన్నట్లయితే షర్మిల తెలంగాణ లో రాజకీయ పార్టీ ప్రారంభించి ఉండేవారు కాదేమో. అయితే మనం ఒకటి తలస్తే దేవుడు మరొకటి తలుస్తాడు.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని అంచనా వేయడమే షర్మిల మొదటగా చేసిన తప్పు. ఒకటి టీఆర్ఎస్ బలంగా ఉంది. రెండు కాంగ్రెస్ పూర్తిగా సమాధి కాలేదు (రేవంత్ రెడ్డి రాకముందు పరిస్థితి) మూడు బిజెపి వైపు యువతరం ఆకర్షితులవుతున్నారు. ఈ మూడు వాస్తవాలను అంచనా వేసుకుని ఉన్నట్లయితే షర్మిల తెలంగాణ లో రాజకీయ పార్టీ స్థాపించే వారు కాదు.

అయితే ఆమె వేసుకున్న అంచనాలు… 1.టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది.2. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు 3. బిజెపి కేవలం పట్టణాలకే పరిమితం అయి ఉంటుంది. అనుకుంటూ తప్పు అంచనాలు వేసుకోవడం వల్లే షర్మిల కు ఇప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు.

300 మంది రాజకీయ ప్రముఖులను ‘‘రాజకీయాలకు అతీతంగా’’ ఆహ్వానించినా పట్టుమని పది మంది కూడా పేర్లు చెప్పుకోదగిన రాజకీయ నాయకులు విజయలక్ష్మి సభకు రాలేదు. ఏపీ కాంగ్రెస్‌కు చెందిన KVP రామచందర్‌రావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్ అటెండ్ అయ్యారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు గోనె ప్రకాష్, BJP నేత కూన శ్రీశైలం గౌడ్, కంతేటి సత్యనారాయణ రాజు, రామచంద్రమూర్తి, మాజీ DGP దినేష్ రెడ్డి, రిటైర్డ్ IPS ప్రభాకర్ రెడ్డితో పాటు శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, DV సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంస్మరణ సభకు విచ్చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ హాజరు కావద్దని ఆ పార్టీ చెప్పింది. ఒక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్ప వేరెవరూ గీత దాటలేదు. టీఆర్ఎస్ గీసిన గీతను ఆ పార్టీ వారూ దాటలేదు. బిజెపి నేతలు కన్నెత్తి కూడా చూడలేదు. ‘‘రాజకీయాలు అతీతంగా’’ అని చెప్పిన ఈ సభలో షర్మిల రాజకీయమే మాట్లాడారు. ఈ విషయం ముందే ఊహించి కాబోలు ఏ రాజకీయ నాయకుడూ రాలేదు.

KVP రామచందర్‌రావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో షర్మిలకు వచ్చే లాభమేమీ లేదు.

తల్లి ఏర్పాటు చేసిన సభకు స్పందన లేదని ముందే తెలుసుకున్న షర్మిల ఒంటరినైపోయాను అని బాధను వ్యక్తం చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు ఉన్న విబేధాలు అక్షరాలా నిజమయ్యేలా ఆ ట్వీట్ ఉండటం గమనార్హం.

‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు.

అంటే తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది.

వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. దీంతో అప్పట్లో మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే తాజాగా ఇద్దరూ ఇడుపులపాయలో కలుసుకున్నప్పటికీ.. అంతేకాదు ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించకోకపోవడం గమనార్హం.

ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని, కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ అవేమీ అస్సలు జరగలేదు. అధికారంలో ఉన్న అన్న చూడడం లేదు… తెలంగాణ లో పార్టీ పెడితే ఎవరూ కలిసి రావడం లేదు… తల్లి తన వైపున ఉన్నా నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నది….

ఏం చేయాలి? అందుకే పాపం షర్మిల అంత మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

త్రికోటేశ్వరుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్

Satyam NEWS

ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టి‌ఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

ఆకట్టుకున్న డాగ్ షో: కుమారుడితో సహా హాజరైన విజయనగరం ఎస్ పి

Satyam NEWS

Leave a Comment