విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం, కష్టం జరగబోదని, అంబేద్కర్ విగ్రహాన్ని సాకుగా చూపి ఉన్మాద రాజకీయాలు చేయెద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైకాపా మాజీ మంత్రులకు హితవు పలికారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర తాటికాయంత అక్షరాలతో అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచేలా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే బారెడంత అక్షరాలను తొలగించారని, అది పెద్ద తప్పు కూడా కాదని చెప్పారు.
ఐదేళ్ళ వైకాపా పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పేర్లు మార్చారని, అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి జగన్ విదేశీ విద్య గా మార్చుకున్నారని, ఎస్సీ ఎస్టీ ల కుల ధృవీకరణ పత్రాలపై ఆయన బొమ్మను ముద్రించుకున్నారని గుర్తు చేశారు. వైకాపా పాలనలో దళితులపై జరిగిన హత్యలు, అత్యాచారాలపై కడుపు మండిన కొందరు వ్యక్తులు చేసిన చిన్న పనికి, ఏదో రాజ్యాంగ ద్రోహం జరిగినట్లుగా చేస్తున్న ప్రచారం మానుకోవాలని పేర్కొన్నారు. అంబేద్కర్ స్మతి వనం లోని మూడు అంబేద్కర్ విగ్రహాలను మాయం చేసిన వైకాపా నాయకులకు అంబేద్కర్ గూర్చి మాట్లాడే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందీ కలుగ చేయదని, వైసీపీ ట్రాప్ లో పడి దళితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకోటయ్య స్పష్టం చేశారు.