31.2 C
Hyderabad
February 14, 2025 19: 55 PM
Slider ముఖ్యంశాలు

11కు పడిపోయినా సిగ్గు రాదా జగన్?

#PKKadapa

‘రైతులంతా సంతోషంగా ఉంటే  ధర్నాలు అంటూ కథలు చెబుతూ, ప్రజలంతా సౌఖ్యంగా ఉంటే నిరసనలు అంటూ డ్రామాలు చేయడం ఆపి.. వైసీపీ పార్టీ నాయకుడు ప్రజలు, అధికారులపై దౌర్జన్యాలు, బెదిరింపులు చేస్తున్న ఆ పార్టీ నాయకులను నిలువరించడం మీద  దృష్టి సారించాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసినా.. అహంకారం మాత్రం ఆ పార్టీ నాయకులకు పోలేదన్నారు. రాయలసీమ ప్రజల సహనంతో వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడి చేసిన కార్యాలయ ఆవరణను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్ బాబు ని పరామర్శించిన అనంతరం.. నేరుగా గాలివీడు మండలం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం జరిగిన సంఘటన తాలూకా వివరాలను, జవహర్ బాబు పై దాడి జరిగిన  కార్యాలయ గదిని పరిశీలించారు.

సిబ్బందిని పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నేను ఉద్యోగుల్లోనూ, రాయలసీమ ప్రజల్లోనూ ఆత్మస్థైర్యం నింపడానికి ఈ పర్యటనకు వచ్చాను. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న కష్టాల నుంచి మెల్లగా బయటకు వస్తున్న తరుణంలో వైసీపీ నాయకులు మళ్లీ రౌడీయిజం, గూండాయిజం అంటూ పేట్రేగిపోతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మర్చిపోయినట్లున్నారు. ప్రజలపై, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు.

మరోసారి ఇలాంటిది జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.  ప్రజలకు అధికారులకు ఏ మాత్రం వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన కఠినమైన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న  తరుణంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సరైన రీతిలో అధికార యంత్రాంగానికి స్పందించకపోతే తగిన రీతిలో చర్యలు ఉంటాయి. గాలివీడు ఎంపీపీగా ఉన్న వ్యక్తి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆమోదాలు పంపడం లేదని అధికారుల ద్వారా తెలిసింది.

దీనిపై చట్టపరంగా నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించకపోవడం వెనుక కారణాలపై నోటీసు ఇచ్చి 14 రోజులు వేచి ఉన్న తర్వాత సరైన స్పందన లేకపోతే చట్టపరంగా తగిన విధంగా ముందుకు వెళ్తాం. వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే దానిని ప్రోత్సహించాలి. అలాకాకుండా ఇష్టానుసారం అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.

అన్నమయ్య జిల్లాలో రూ.70 కోట్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, సంక్రాంతి నాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. అభివృద్ధి పనులు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం కొత్త దశలో ఆంధ్రప్రదేశ్  తీసుకువెళ్తుంది. గతంలో మాదిరి మేం చేసిందే చట్టం… మేము ఇచ్చిందే తీర్పు అంటే- రాయలసీమ యువతరం ఇప్పుడు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. రాయలసీమ ఎవరి జాగీరూ కాదు. రాయలసీమ యువతకు ఉపాధి కావాలి. మారుతున్న కాలానికి తగినట్లుగా వారి జీవితాలు మారాలి.

దీని కోసం యువత వేచి చూస్తున్న సమయంలో కావాలని గొడవలు సృష్టించి, వైషమ్యాలు సృష్టిస్తే యువతరం తగిన బుద్ధి చెబుతుంది. రాయలసీమ యువత ఇప్పుడు మార్పు కోరుకుంటుంది. తరతరాలుగా వస్తున్న అహంకార ఆధిపత్య ధోరణిని ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. వైసీపీ నాయకుల ఆధిపత్య ధోరణి, వారి అహంకారం తగ్గడం లేదు. వారి అహంకారానికి ఎవరు అడ్డు వచ్చినా దాడులకు తెగబడి  ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. కులాలతో, మతాలతో సంబంధం లేకుండా.. ఎవరైనా సరే వారికి ఎదురు చెబితే  దాడులు చేస్తూ ఆనందం పొందుతున్నారు. నేను రాయలసీమ గడ్డపై నిలబడి చెబుతున్నాను.

ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్లీ వేస్తే ఇక్కడే క్యాంపు కార్యాలయం పెట్టి మీ అందరూ లెక్కలు చూసి మరీ వెళ్తాను. రాయలసీమ యువత నైపుణ్యాన్ని పెంచేలా, వారికి ఉపాధిదారులు చూపేలా కూటమి ప్రభుత్వం బలంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సరికొత్త ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల చేష్టలపై సంయమనం పాటిస్తోంది. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. తప్పు చేసిన వారి ఇంటికి వచ్చి మరి లాక్కొచ్చి కటకటాలలోపెడతాం. అధికారంలో ఉన్నాను కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను.

అనవసరంగా సమస్యలు సృష్టించి అభివృద్ధికి విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు.  జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న యువతరం వైసీపీ చేస్తున్న అరాచకాలపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి నాయకులను రాజకీయాల నుంచి తరిమికొట్టే రోజులు మరింత దగ్గరగా ఉన్నాయి” అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. గాలివీడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న సమాచారం తెలుసుకున్న యువతరం, మహిళలు.. గాలివీడు రోడ్డుకు ఇరువైపులకి పెద్ద ఎత్తున చేరారు. మహిళలు  హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. యువతరం పెద్దఎత్తున ఇతర గ్రామాల నుంచి కూడా తరలివచ్చి ఉప ముఖ్యమంత్రికి తమదైన రీతిలో కేరింతల స్వాగత మాల వేశాయి.

Related posts

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మోయిజూద్దీన్

Sub Editor

వడదెబ్బ తగులుతుంది అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment