ఏపీలో గత వైసీపీ జమానాలో జరిగిన దారుణాలు, దౌర్జన్యాలు, దురాగతాలు… కూటమి సర్కారు కొలువుదీరినా తగ్గడం లేదు. వైసీపీ జమానాలో జరిగినట్టుగానే… కూటమి పాలనలోనూ అక్కడక్కడ జరుగుతున్న కొన్ని ఘటనలు నిజంగానే కూటమిలోని పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బావమరిదిపై ఆదివారం జరిగిన దాడి ఈ కోవ కిందకే వస్తుందని చెప్పాలి. తాను ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెయ్ పీ) నేత బెహరా అనిల్ తన స్నేహితులతో కలిసి జూలకంటి బావమరిది కృష్ణారెడ్డిపై దాడికి దిగాడు.
ఈ దాడిలో గాయపడ్డ కృష్ణారెడ్డి పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించగా… కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్ తో పాటు అతడి మిత్రులను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూలకంటి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అప్పటికే వరుసగామూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అరాచకాలతో విసిగిపోయిన మాచర్ల ఓటర్లు జూలకంటిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అయినా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పిన్నెల్లి అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైనం కనిపిస్తోంది. గతంలో మాదిరే బెదిరింపులు, దౌర్జన్యాలు కూడా ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి.
ఇలాంటి దారుణాలకు అలవాటుపడ్డ కొందరు వ్యక్తులు ఆ తరహా వైఖరిని వీడటం లేదు అందులో భాగంగానే తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఏకంగా అప్పు ఇచ్చిన వ్యక్తులపైనే దాడులు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… గత కొంత కాలం క్రితం కృష్ణారెడ్డి నుంచి అనిల్ కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోడంతో ఆదివారం అనిల్ ను కలిసిన కృష్ణారెడ్డి తన అప్పు చెల్లించాలని కోరాడు. అయితే అప్పటికే స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఉన్న అనిల్ అందుకు తిరస్కరించినట్లు సమాచారం.
ఈ క్రమంలో తన ద్దే అప్పు తీసుకుని దానిని చెల్లించకపోవడం ఏమిటని కృష్ణారెడ్డి నిలదీయడంతో… మద్యం మత్తులో కోపోద్రిక్తుడైన అనిల్ తన స్నేహితులతో కలిసి కృష్ణారెడ్డి, ఆయన స్నేహితుడు మాధవరావుపై దాడికి దిగారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బావమరిదిపైనే అకారణంగా దాడి చేసిన అనిల్ ఉదంతం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.