బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇప్పుడు ఫార్ములా ఈ కారు రేసుల ఉచ్చులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ పై ఇటు ఏసీబీతో పాటుగా అటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు సంస్థల నుంచి విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులూ అందాయి. ఈ సంస్థల విచారణకు హాజరయ్యే విషయంలో కేటీఆర్ ఆసక్తిగానే ఉన్నా… ఎందుకనో రోజుకో ఆసక్తికర ఘటన నమోదు అవుతూ వస్తోంది.
ఈ కేసులో కేటీఆర్ ను ఇరికించింది ఓ కంపెనీ అని… దాని పేరు గ్రీన్ కో అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ కంపెనీ యజమాని ఏపీకి చెందిన ఒకప్పటి అధికార పార్టీ వైసీపీకి చెందిన వారేనన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే దిశగా నగరంలో ఫార్ములా ఈ కారు రేసులను జరపాలని గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో రేసులకు స్పాన్సర్ గా వ్యవహరించే కంపెనీల కోసం వెదికిన నాటి కేసీఆర్ సర్కారు… గ్రీన్ కో కంపెనీని ఎంపిక చేసింది.
ఓ ఏడాది పాటు ఈ రేసులను స్పాన్సర్ చేసిన గ్రీన్ కో… రేసుల వల్ల తనకు నష్టాలు వస్తున్నాయంటూ స్పాన్సర్ షిప్ ను వదులుకుంది. గ్రీన్ కో వదులుకున్న స్పాన్సర్ షిప్ ను మరో కంపెనీకి కట్టబెట్టకుండా… స్వయంగా తెలంగాణ ప్రభుత్వం తానే స్పాన్సర్ గా ఉండాలని నాడు కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే… కారు రేసులను నిర్వహించే సంస్థకు సర్కారు ప్రజా ధనాన్ని పంపాల్సి వచ్చింది. అంటే… బీఆర్ఎస్ సర్కారు ఈ వ్యవహారంలో దోషిగా నిలబడటానికి పరోక్షంగా గ్రీన్ కోనే కారణమందన్న మాట.
అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పాన్సర్ షిప్ ను గ్రీన్ కో వదులుకుందని, అయినా కూడా ఆ కంపెనీపై కేసీఆర్ సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా కేసీఆర్ సర్కారును, ప్రత్యేకించి కేటీఆర్ ను అడ్డంగా బుక్ చేసిన గ్రీన్ కో పై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఈ కంపెనీ ఎవరిదన్న విషయంపైనా జనం బాగానే చర్చించుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుటుంబం ఆధ్వర్యంలోనే గ్రీన్ కో నడుస్తోంది.
సునీల్ సోదరుడు అనిల్ ఈ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. సునీల్ రాజకీయాలపై మక్కువతో చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. కాకినాడకు చెందిన ఈయన ఆదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి చేరిన సునీల్… మొన్నటి ఎన్నికల్లో కాకినాడ నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.
జనసేన నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఇప్పటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగేందుకే సునీల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు అయిన బీఆర్ఎస్, వైసీపీలతో మంచి స్నేహ సంబంధాలను ఆయన కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీలోని కర్నూలు జిల్లాలో బారీ ఎత్తున గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టారు. అదే సయమంలో బీఆర్ఎస్ సర్కారుతో స్నేహం కారణంగా తెలంగాణలోనూ ఆయన తన కంపెనీని ఓ రేంజిలో విస్తరించారన్న వార్తలు ఉన్నాయి.
బీఆర్ఎస్ కు దాదాపుగా రూ.41 కోట్ల మేర నిధులను ఆయన ఎలక్టోరల్ బాండ్ల రూపేణా అందించారని తాజాగా వెల్లడైంది. ఫార్ములా రేసుల నుంచి తప్పుకుని… తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఆయన ఈ నిధులను బీఆర్ఎస్ కు ఇచ్చారన్న ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ ను, ప్రత్యేకించి కేటీఆర్ ను ఈ వివాదంలో చిక్కుకుపోవడానికి గ్రీన్ కోనే ప్రదాన కారణమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇక సునీల్ సోదరుడు అనిల్ అటు వ్యాపార వర్గాలతో పాటుగా ఇటు సినీ వర్గాలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలను నెరపుతుంటారని వినికిడి. ఇటీవలే తన జన్మదిన వేడుకలను మాల్దీవుల్లో జరుపుకున్న ఆయన… ఆ వేడుకలకు టాలీవుడ్ కు చెందన అగ్ర హీరోలను ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీలు ఇచ్చినట్లు వార్లలు వచ్చాయి.