ఎన్నికల వేళ బరిలో నిలబడ్డ అభ్యర్థుల చుట్టూ ఎప్పుడూ జనం తిరుగుతూనే ఉన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు ఉదయం ఇంటి నుంచి కాలు బయట పెట్టింది మొదలు రాత్రి పడుకునే వరకూ గెలుపు కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి, వైసీపీ అభ్యర్థులు బాగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ రోడ్ షోలు, సభలకు భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు. కొంత మంది అభ్యర్థుల వద్ద జనం పలుచగా కనిపిస్తుంటే.. మరికొంత మందికి తమ అభిమాన నేత కోసం ప్రజలు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థుల విషయంలో జనం విసిరేసినట్లుగా అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ బస్సు యాత్ర కూడా చాలా చోట్ల ఏ హడావుడి లేకుండానే ముగిసిపోయింది.
అయితే ఈ ప్రచారానికి వస్తున్న వారిలో ఎంతమంది తమ పార్టీకే ఓటు వేస్తారో అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వైఖరి వైసీపీ అభ్యర్థుల్లో నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు కూడా తాము.. ఈసారి ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తామంటూ చెబుతున్నారు. ఇలా కొందరి అభిప్రాయాలు తమ సన్నిహితుల వద్ద చెబుతుండడంతో.. వైసీపీ నేతల్లో గుబులు మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొహమాటం కొద్దీ వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నామని.. తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదంటూ మరికొందరు బహిరంగంగానే చెబుతున్నారు.
వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయాక ఇక ఆ పార్టీకి రాం రాం చెప్పేయాలని చాలా మంది చూస్తున్నారు. గెలవడం కష్టమని ముందే వైసీపీ అభ్యర్థులకు దూరంగా ఉండడం మంచిది కాదని.. మద్దతు ఇస్తున్నట్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలు చూడటంతో పాటు.. అక్కడ తాయిలాల పంపకాల ప్రక్రియ పర్యవేక్షణ కోసం గ్రామాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించారు. ఆ ఇన్‌ఛార్జిలు గ్రామాలవారీ వెళ్లి ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. వందలో 80 నుంచి 90 మంది తాము కూటమి అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు.
అదే సమయంలో డబ్బుల పంపిణీ ఎంత వరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా ఆరా తీస్తున్నారు. ఈసారి ప్రజలు వైసీపీపై వ్యతిరేకతతో ఉన్నారని.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండటంతో కూటమికే గెలుపు అవకాశాలున్నాయని గ్రామాల్లో ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది అభ్యర్థి వద్దకు వెళ్లి.. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దని సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల్లో ఇలాంటి ధోరణే కనిపిస్తోందని చెబుతున్నారు.