36.2 C
Hyderabad
April 25, 2024 19: 18 PM
Slider ప్రత్యేకం

బూమ్ రాంగ్: బెడిసికొట్టిన విజయసాయిరెడ్డి వ్యూహ్యం

#MP Vijayasaireddy

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ విడుదల చేసిన వీడియోలతో వైసీపీకి లాభం కలగకపోగా రాజకీయంగా నష్టం వాటిల్లినట్లు పార్టీ ఒక అంచనాకు వచ్చింది.

కమ్మ కులస్తులు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారని, దీనివెనుక చంద్రబాబునాయుడు ఉన్నాడని చెప్పేందుకు చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఒక్క సారిగా వైసీపీ ఆత్మరక్షణలో పడింది. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు, బిజెపి నాయకుడు సుజనా చౌదరితో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రమేష్ కుమార్ హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో రహస్యంగా కలిసినట్లు వీడియో ఫుటేజీని సంపాదించి దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లలో వచ్చే విధంగా వైసీపీ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

ఒక రోజు సైలెంటుగా ఉండి ఎదురు దాడిచేసిన బిజేపీ

ఒకే సారి అన్ని ఛానెళ్లలో ఒకే వార్త రావడంతో అందరూ నమ్ముతారని ఆ పార్టీ నాయకులు భావించారు కానీ ఒక రోజు మొత్తం సైలెంటుగా ఉన్న బిజెపి మరునాటి నుంచి ఎదురుదాడికి దిగింది. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై తక్షణమే రమేష్ కుమార్ కు మద్దతుగా మాట్లాడినా ఆ పార్టీ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అందరూ బీజేపీ వైపే చూడటం, బిజెపి నిశ్శబ్దంగా ఉండటంతో పలు రకాల ఊహాగానాలు వ్యాపించాయి.

అయితే సర్దుకున్న బిజెపి ముగ్గురు కలయికలో తప్పేంలేదని తేల్చి చెప్పింది. దాంతో బీజేపీపై నేరుగా మాటల యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. అదే విధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులను ఎలా కలుస్తారని వైసీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించడం కూడా ఆ తర్వాత వివాదం అయింది. రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా అంగీకరిస్తున్నారా?

అయితే తదుపరి చర్యలు తీసుకోండి అంటూ ప్రతిపక్షాలు దూకుడు ప్రదర్శించడంతో ఆ అంశంలో కూడా వైసీపీ తన వాదనను సమర్ధించుకోలేకపోయింది. ఇంతకాలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎలా చెబితే అలా చేస్తున్నారని వైసీపీ వాదన వినిపించింది.

వైసీపీ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగిందా?

ఇప్పుడు బిజెపి నాయకులతో ఆయన కలవగానే తెలుగుదేశం బిజెపి కలిసి పని చేస్తున్నాయని చెప్పడం ప్రారంభించింది. సుజనా చౌదరిని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే హోటల్ లో కలిశారనే ప్రచారం జరగడం కూడా వైసీపీ సైలెన్సుకు కారణం అయింది. వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే సుజనా చౌదరిని కలిశారా అనే ప్రశ్నకు సమాధానం వచ్చే అవకాశం లేదు కానీ అందరిలో అనుమాన బీజాలు మాత్రం నాటుకున్నాయి. ఈ అంశాలన్నీ వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టాయి.

Related posts

నేతాజీకి నివాళుల‌ర్పించిన ఓయూ జాక్ రాష్ర్ట కార్య‌ద‌ర్శి

Sub Editor

పని చేయించుకుని బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇది

Satyam NEWS

అగ్నిపరీక్షలో రఘురాముడిని గాలికి వదిలేసిన కమలనాథులు

Satyam NEWS

Leave a Comment