కర్నాటక ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీలో కలవరం రేపుతున్నాయి. కర్నాటకలో అధికారంలో ఉండి, ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ వరకూ అందరూ ప్రచారం చేసినా కూడా కర్నాటకలోని అధికార బీజేపీ ఖంగుతిన్నది. కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీపై అవినీతి మరకలు చాలా ఉన్నాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి ఉన్నది. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో బాటు అధికార పార్టీ నాయకులు కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ ఆక్రమించేస్తున్నారు.
ఈ విషయాలన్నింటిపైనా ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అయినా అధికారంలో ఉన్నాం కదా మళ్లీ మనమే గెలుస్తాం అని చాలా మంది వైసీపీ నేతలు అనుకున్నారు. అయితే కర్నాటకలో అధికారంలో ఉండటమే కాకుండా స్వయంగా కేంద్రంలో గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న అతి ముఖ్యమైన నాయకులు వచ్చినా అక్కడి బీజేపీ గెలవలేదు. బీజేపీలో ఇంత మంది నాయకులు, అంతులేని అధికారం, ధన బలం ఉన్నా కూడా గెలవలేకపోవడంతో ఏపిలో తమ పరిస్థితి ఏమిటనే చర్చ అధికార వైసీపీలో మొదలైంది. తాము కేవలం జగన్ పై మాత్రమే ఆధారపడి ఎన్నికలు నిర్వహించుకోవాల్సి వస్తుంది.
అసలే జగన్ పై వ్యతిరేకత ఉన్నందున తాము ఎలా గెలవాలనే ఆందోళనలో వైసీపీ నేతలు పడిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు ఉంటే సునాయాసంగా గెలవచ్చునని ఇంత కాలం వైసీపీ నేతలు భావించారు. అయితే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారంలో ఉండి కూడా తమకు తామే చేసుకోలేని బీజేపీ నేతలు తమను ఆదుకుంటారని అనుకోవడం తప్పే అవుతుందని ఇప్పుడు వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉంటే ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసుకోవచ్చునని ఇంతకాలం భావించిన వైసీపీ నేతలకు కర్నాటక ఎన్నికలు కళ్లు తెరిపించాయి.
ప్రజలు తిరస్కరిస్తే ఎవరూ కాపాడలేరనే అంచనాకు వారు వచ్చినట్లు కనిపిస్తున్నది. కర్నాటకలో తమ పార్టీనే గెలిపించుకోలేని బీజేపీ ఆంధ్రాలో తమను గెలిపిస్తుందని నమ్ముకోవడం వల్ల లాభం లేదని వైసీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. తీవ్రంగా పెరిగిపోయిన అవినీతి, అధికారం ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలపై ఇప్పటికే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్నందున ఇక తమను ఎవరూ కాపాడలేరనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చేశారు. ఇంత కాలం తమ పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించిన బీజేపీ నేతలు ఇక నుంచి అలా ఉండే అవకాశం లేదని, ఉన్నా ప్రయోజనం లేదని వైసీపీ నేతలు ఒక అంచనాకు వచ్చేశారు.
బీజేపీ కూడా వైసీపీ పట్ల తమ వైఖరి మార్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. వైసీపీకి అండగా తాము ఉన్నామని ప్రజలకు తెలియడం వల్ల తమ పై కూడా వ్యతిరేకత పెరిగిపోతున్నదని బీజేపీ భావిస్తున్నట్లు వైసీపీ ఒక అంచనాకు వచ్చింది. మొత్తానికి కర్నాటక ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకున్నారు.
పులిపాక సత్యమూర్తి, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్