33.2 C
Hyderabad
April 25, 2024 23: 21 PM
Slider ముఖ్యంశాలు సంపాదకీయం

చెత్తపలుకు: అధికారం-ఒకటిన్నర ఎకరం స్థలం

morning walk

ప్రాంతీయ పార్టీల వల్ల రాజకీయాలతో బాటు రాష్ట్రాలు కూడా నాశనం అవుతున్నాయి- కొత్తపలుకు కనిపెట్టిన ఈ వారపు నగ్న సత్యం. ఆంధ్రప్రదేశ్ లో సిబి నాయుడు అధికారం కోల్పోవడం, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫొటో దిగడం… ఈ రెండు సంఘటనలూ అ.జ్యో.రా ఆలోచనలో ఎంత మార్పు తెచ్చాయి? ఈ మార్పులు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి అవసరం లేదనే నిర్ణయానికి అతగాడిని తెచ్చేశాయి. ఆహా… రానున్న రోజుల్లో అ.జ్యో.రా లో జాతీయ భావనలు ఉప్పొంగుతాయన్నమాట.

తెలంగాణలో కేసీఆర్ అధికారం నిలబెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో సిబి నాయుడి కుబుసాలు కదిలిపోవడంతో ఇప్పుడు అమిత్ షా ఒక్కడే అ.జ్యో.రా కు ఆరాధ్య దైవంలా కనిపించడంలో తప్పులేదు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ అ.జ్యో.రాను చేరదీసే అవకాశమే లేదు. అందుకే ఈ రెండు రాష్ట్రాలలో జరుగుతున్న సంక్షేమ పథకాలు విషతుల్యం అయిపోయాయి. సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయిపోతున్నదట. అభివృద్ధి దిక్కులేకుండా పోతున్నదట. ఏమి కంక్లూజన్ సోదరా. నీకు నీవే సాటి.

ఒక్క మాటకు సమాధానం చెప్పు. అభివృద్ధి అంటే నీ దృష్టిలో ఏమిటి? నేను చెప్పనా. నీ దృష్టిలో అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. వరల్డ్ క్లాస్ రాజధాని కట్టడమనే మాట చెబుతూ ఇన్ సైడ్ ట్రేడింగ్ చేయడం. అభివృద్ధి అంటే రైతుల నుంచి భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతులా చూసుకోవడం. ఆ బాతు మన చేతులోనుంచి జారిపోయిందనే ఉక్రోషంతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం. అర్ధం అయిందా?

సంక్షేమం ప్రాంతీయ పార్టీలు అనే విషయానికి వస్తే అసలు తెలుగు ప్రజలకు ఉచితంగా పంచిపెట్టే స్కీమ్ లకు ఆద్యుడు ఎన్టీఆర్. ఇదేంటని ఆనాటి కేంద్ర ప్రభుత్వం అడిగితే మా రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు అది తప్పని సరి అని ఎన్టీఆర్ చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పడు జగన్, కేసీఆర్ కూడా అదే చెబుతున్నారు. మా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయని. తప్పేముంది? ఇది తప్పు అయితే ఆనాడు ఎన్టీఆర్ చేసిన నాటి నుంచే తప్పు. ఒప్పు అయితే ఆ నాటి నుంచి ఒప్పే. మనకు అధికార ద్వారాలు మూసుకుపోతే తప్పు, మనవాడు అధికారంలో ఉండి మనకు ఎడ్వర్టైజ్మెంట్లు, స్థలాలు ఇస్తుంటే కరెట్టు ఎలా అవుతుంది?

అ.జ్యో.రా మరో కొత్త విషయం చెప్పేశాడు ఈ వారం. తమకు నచ్చిన సంక్షేమ పథకాలు తమ సొంత డబ్బులతో జగన్ కేసీఆర్ చేసుకుంటే తనకు అభ్యంతరం లేదట. ఆహా … అలాగా మరి హైటెక్ సిటీని సిబినాయుడు సొంత డబ్బులతో కట్టాడా? హైటెక్ సిటీ కట్టిన తర్వాత సిబి నాయుడికి పదేళ్లు అధికారమే దక్కలేదు. 2004 తర్వాత హైదరాబాద్ లో అభివృద్ధే లేదు. అంతా ఎడారిగా మారిపోయింది. ఏం చెబుతావు సోదరా. అబద్ధాలు కూడా అతికినట్లు చెప్పే విద్య నీకు చిన్నప్పటి నుంచే ఉన్నట్లుంది.

సంక్షేమ పథకాల అమలు వల్ల ఆంధ్రా తెలంగాణ ల్లో డబ్బుల్లేకుండా పోయాయని చెబుతున్నాడు అ.జ్యో.రా. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని స్థితికి వచ్చింది తెలంగాణ కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే అంటూ తీర్పు చెప్పేశాడు. బిజెపి పాలిత రాష్ట్ర మైన ఉత్తరప్రదేశ్ లో 25 వేల మంది హోం గార్డులను తీసేశారు. ఎందుకో తెలుసా. డబ్బుల్లేక. కానిస్టేబుల్స్ తో సమానంగా జీతం ఇవ్వమని కోర్టు చెబితే ఇవ్వకపోగా వారికి ఉద్యోగాలు లేకుండా చేసేశారు. సోదరా, అన్నీ తెలుసుకుని కాలమ్స్ రాయాలి.

మన ల్యాండ్ పోయిదన్న ఉక్రోషంలో రాస్తే ఇలానే ఉంటుంది. ప్రభుత్వాల వద్ద డబ్బులు లేకపోవడం చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడైతే ఆర్ధిక మాంద్యం వల్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. డబ్బుల్లేక బంగారం తాకట్టు పెట్టుకున్న స్థాయి నుంచి పైకి వస్తున్నాం. ఈరోజు ఏపి లో డబ్బుల్లేవని రాస్తున్న అ.జ్యో.రా ఒక్క సారి ఏపి ఆర్ధిక మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడిని అడగమను సిబినాయుడి పాలనలో ఎన్ని సార్లు వేస్ అండ్ మీన్స్ కు, ఓడికి వెళ్లారో. అభివృద్ధి పథకాలకు డబ్బు కావాలని రిజర్వు బ్యాంకు దగ్గర డబ్బలు తెచ్చి పసుపను కుంకుమకు పంచితే రిజర్వు బ్యాంకు తాఖీదు పంపిందో లేదో కనుక్కో.

ఆటో వాళ్లకు డబ్బులిస్తే అభివృద్ధి ఆగిపోతుందా? సిబి నాయుడి టైమ్ లో కట్టిన ఫ్లై ఓవర్లు, వేసిన రోడ్లు ఏ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చారో కనుక్కో. ప్రాజెక్టు మొదలు పెట్టేదే కమిషన్ల కోసం అయితే అది అభివృద్ధి కిందకు వస్తుందా దోపిడి కిందిక వస్తుందా? 60 వేల కోట్లతో నవరత్నాలు అమలు చేయడం రాష్ట్రానికి శాపంగా మారుతుందట. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ కు గుదిబండలు గా మారతాయట.

సీన్ కట్ చేస్తే … తమకు ఇచ్చిన భూమిని ఏపి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న కసి కనిపిస్తున్నది. ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్ ను విస్తరించే సమయంలో నీవు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వు నేను ఈనాడు రిపోర్టర్ ను. అప్పుడు ఏం జరిగిందో నీకు గుర్తులేదేమో. చెబుతా విను. పాలమూరు జిల్లాల్లో ఆకలి చావులు చస్తున రోజులవి. ప్రభుత్వమే గంజి కేంద్రాలు పెట్టాల్సిన దారుణమైన కాలమది. ఆ కాలంలో ఎన్టీ రామారావు ట్యాంకు బండుపై తెలుగు మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం అని పేరు పెట్టి ప్రముఖుల విగ్రహాలు పెట్టాడు. దాన్ని అప్పటిలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ట్రాఫిక్ సమస్య లేని పెరేడ్ గ్రౌండ్స్ రోడ్డుపై మూడు ఫ్లైఓవర్లు కట్టిన సిబినాయుడు ట్రాఫిక్ సమస్యలు తెచ్చిపెట్టాడు. ఆయన అమరావతి వెళ్లాడు కానీ ఆ రోడ్డుపై నిత్యం ప్రయాణించే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదేనా అభివృద్ధి అంటే?

మనం తెల్లబట్టలు వేసుకుని వాకింగ్ చేసే పార్కు అందంగా ఉండటం అభివృద్ధి కాదు సోదరా. పేద రైతు ఆకలితో ఉండకపోవడం అభివృద్ధి. వానలో చలిలో సరైన బట్టలు కూడా లేకుండా ఉండేవారు వెచ్చగా ఉండటం అభివృద్ధి. పరిశ్రమలు పెట్టి కొల్లకొట్టడం కాదు అభివృద్ధి అంటే. పేదవాడికి పని ఇప్పించడం అభివృద్ధి.

కాంట్రాక్టర్లు బతకడం కాదు సోదరా అభివృద్ధి అంటే కూలీలు బతకడం. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు స్వేచ్ఛ సోదరా. పత్రిక అధిపతులది కాదు. అసత్యాలు అడ్డంగా రాసేవారికి అంతకన్నా కాదు. సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

ఒంటిమిట్ట కు ఎపి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

Satyam NEWS

ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడతాం

Satyam NEWS

బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

Murali Krishna

Leave a Comment