వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ సర్దేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తన క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం ఎంతగా నూరిపోస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఆయన నిర్వహిస్తున్న సమావేశాల్లో జగన్ చెప్పే మాటలను బుద్ధిగా వింటూనే ఇక నియోజకవర్గాల్లో తమకు తోచినది తాము చేసేస్తున్నారు. పార్టీలో కొనసాగడం కష్టమనే నిర్ణయానికి వచ్చేసి బిచాణా ఎత్తేస్తున్నారు. మొన్నటికి మొన్న కుప్పంలో వైసీపీ ఆఫీసును ఎత్తేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఓ రెస్టారెంటుగా మార్చారు. పైగా ఆ హోటల్‌కు ‘హోటల్ అమరావతి’ అనే పేరు పెట్టి త్వరలో ప్రారంభం అని ఫ్లెక్సీలు కూడా తగిలించారు.
ఆ పరిణామం జరిగి వారం రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోనూ మరో వైసీపీ ఆఫీసును ఎత్తేశారు. అద్దె కట్టలేక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని మూసేయాల్సి వచ్చింది. ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ కోఆర్డినేటర్ గా సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో అంతా హంగామా భారీగా ఉండేది. భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. అప్పుడు ఆ వైసీపీ ఆఫీసు నిర్వహణ ఖర్చులు అన్నీ పార్టీ అధిష్ఠానమే భరించేది.
అయితే ఎన్నికల్లో 42 వేల ఓట్ల పైచిలుకు తేడాతో నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. దీంతో గత రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణను పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు కూడా ఆచూకీ లేకుండా తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఇక మిగిలిన వ్యక్తి అయిన ఓడిపోయిన అభ్యర్థికి సదరు పార్టీ ఆఫీసు నిర్వహణ భారంగా మారడంతో వైసీపీ ఆఫీసును మూసేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న జగన్ బొమ్మలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను కూడా తొలగించేశారు.
ఆర్థిక వనరులను సమకూర్చగలిగిన ఇన్‌ఛార్జి వచ్చే వరకు ఇక అంతే సంగతులంటూ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పరిస్థితి చూసి మరీ ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది అనుమానంగానే ఉంది. ఇలా ఒక చోట వైసీపీ ఆఫీసులు మూసేయగా.. దాన్ని చూసి మరిన్ని చోట్ల కూడా పార్టీ కార్యాలయాలు మూసేస్తున్న పరిస్థితి నెలకొంది.