ప్రధాని నరేంద్ర మోడీ మాయా జాలం ఏమిటో కానీ ఉప్పు నిప్పుగా ఉండే వై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒకే గీతం పాడాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దగ్గర కావాలని రెండు పార్టీలూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ మద్దతు పలికాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు రెండు పార్టీలూ పోటీ పడి మరీ విమర్శించాయి. ఆర్టికల్ 370 విషయానికి వస్తే టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో తన మద్దతు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. సోమవారం నాడు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడారు.370 ఆర్టికల్ రద్దు వల్ల దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు మేలు కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 370 ఆర్టికల్ రద్దును తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆర్టికల్ 370 తో కాశ్మీర్ ప్రజలకు మేలు జరగలేదని ఆయన చెప్పారు. కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదం కూడ పెరిగిపోయిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించినపుడు భారత సైన్యం పాక్‌చొరబాటును తిప్పికొడుతూ దాదాపు 25 కిలోమీటర్లు పాక్‌భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నారు. ఆనాడు భారత సైన్యాన్ని వెనక్కి రప్పించి నెహ్రూ చారిత్రక తప్పిదం చేయలేదా అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం ద్వారా నెహ్రూ నాటి కాశ్మీర్ పాలకుల ఒత్తిడికి తలవంచబట్టే నేడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. భారత దేశాన్ని ఒక దేశంగాను, ఒక సంఘటిత ప్రాంతంగాను, ఒక జాతిగాను చూడాలన్న ఆకాంక్షతో దేశ ప్రజలు 1947 నుంచి పోరాడుతూనే ఉన్నారు. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈరోజు హోం మంత్రి అమిత్‌షా నడుం బిగించారు. సర్దార్ పటేల్‌విడిచి పెట్టిన కార్యాన్ని హోం మంత్రి పూర్తి చేస్తున్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.