గుంటూరు హోమ్

శాసన మండలిలో కాఫీ రగడ!

#ArakuCoffee

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఉన్నతమైనవో మరోసారి నిరూపితమైంది. మండలి ఛైర్మన్ “మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోంది” అని సెలవిచ్చారు. సాధారణంగా మనం కాఫీ అంటే కాఫీ అనే అనుకుంటాం, ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు భగ్గుమన్నారు. “మండలిలో కాఫీ, అసెంబ్లీలో కాఫీ ఒకటే ఉండాలి! భోజనాలు కూడా ఒకటే ఉండాలి!” అని పట్టుబట్టారు. ఇది ఎంత గొప్ప డిమాండ్! ప్రజల కష్టాలను, సమస్యలను పక్కన పెట్టి, సభలో చర్చించడానికి ఇంత ముఖ్యమైన అంశం దొరకడం మన ప్రజా ప్రతినిధుల అంకితభావానికి నిదర్శనం. ప్రజలంతా ఒకే దేశం, ఒకే పన్ను (One Nation, One Tax) గురించి మాట్లాడుకుంటే, మన నాయకులు మాత్రం “ఒకే రాష్ట్రం, ఒకే కాఫీ (One State, One Coffee)” అని నినాదం చేస్తున్నారు.

ఈ అంశంపై ఆర్ధిక, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ “ఇలాంటి తేడా ఎక్కడా లేదు, ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ మాటల్లోనే ఆయన వినయం, అంకితభావం కనిపిస్తుంది. ఎందుకంటే, ఒక చిన్న కాఫీ పొరపాటు జరగకుండా చూడటం అనేది దేశంలో ఛాయ్ వాలా నుండి ప్రధానిగా ఎదిగిన మోడీ కి కూడా సాధ్యం కాని విషయం. కానీ మంత్రి కేశవ్ ఆ హామీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

చివరకి, వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టగా, ఛైర్మన్ సభను వాయిదా వేశారు. ఒక కాఫీ కప్పు కోసం, ఒక శాసనమండలి సభ వాయిదా పడింది. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పటిష్టంగా, ఎంత సున్నితంగా ఉందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. మనం ఈ గొప్ప ఘట్టాన్ని చూసిన తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా ఇంత గొప్ప చర్చలు, ఇంత గొప్ప పోరాటాలు చేసే మన వైకాపా నాయకులకు సెల్యూట్ చేయాల్సిందే. వారే కనుక ప్రజల సమస్యల మీద ఇంత అంకితభావం చూపించి ఉంటే, మన రాష్ట్రం ఎప్పుడో అగ్రరాష్ట్రం అయ్యేది! మరి ఈ కాఫీ రగడకు ముగింపు ఎప్పుడు? అసెంబ్లీ కాఫీ ఫ్రాంచైజ్ మండలిలో కూడా వస్తుందా? లేదా మండలి కాఫీని అసెంబ్లీలోకి కూడా తీసుకువస్తారా?  అసెంబ్లీలో కాఫీ కోసం అయినా వారి అధినేత పులివెందుల ఎమ్మెల్యే హాజరవుతాడా? వీరికి కాఫీ సమస్య మీద మండలిని స్తంభింపజేయాలని చెబుతాడా? ఈ ఉత్కంఠకు తెర పడే రోజు కోసం ఎదురుచూడాలి.

Related posts

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News

Leave a Comment

error: Content is protected !!