కడప హోమ్

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

#DhirajKunubilliIAS

దసరా పండుగ అనగానే ప్రతి ఇంట్లో సంతోషం, వెలుగులు, పూజలు, బంధువుల కలయికతో సందడి మొదలవుతుంది. అయితే, ఇదే సమయం దొంగలకూ అవకాశాల సమయం అవుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా శెలవులకు వెళ్లేవారు ఇంటిని భద్రంగా ఎలా ఉంచుకోవాలో వివరంగా సూచనలు చేశారు. పండుగలు అంటే కుటుంబం, బంధువులతో గడిపే మధురమైన సమయం.

ఇంటి వెలుగులు, ఉత్సవ వాతావరణం మన అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో మనం నిర్లక్ష్యం చేస్తే, దొంగలు ఆ ఆనందాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. చాలా సార్లు ప్రజలు పండుగ ఉత్సాహంలో ఇంటిని వదిలి బంధువుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఖాళీ ఇళ్లు దొంగలకు టార్గెట్ అవుతాయి. ఒక్క చిన్న జాగ్రత్త మరిచినా, అది పెద్ద నష్టానికి కారణమవుతుంది. తలుపులు సరిగా తాళం వేయకపోవడం, బయట తాళం వేసి వెళ్ళిపోవడం, విలువైన వస్తువులు ఇంట్లో వదిలేయడం – ఇవన్నీ దొంగలకు ఆహ్వానం పలికినట్టే. మీరు ఇంటి వద్ద లేకపోయినా, మీ ఇల్లు సురక్షితంగా ఉందన్న నమ్మకం మీకు ఉండాలి. ఆ నమ్మకం రావాలంటే ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలి.

ఇంట్లో సీసీ కెమెరాలు, అలార్మ్ సిస్టమ్స్, సెన్సార్ లైట్లు అమర్చండి. ఇవి దొంగలను భయపెడతాయి, పోలీసులు విచారణ చేయడానికీ సహాయపడతాయి.

విలువైన వస్తువులు ఎప్పుడూ ఇంట్లో వదిలేయవద్దు. అవి తప్పనిసరిగా బ్యాంక్ లాకర్‌లో ఉంచాలి. నగలు, నగదు, ముఖ్య పత్రాలు ఇంట్లో ఉంటే దొంగలకే లాభం, మీకే నష్టం.

గేట్లకు బయట తాళం వేసి వెళ్ళవద్దు. అది “ఇల్లు ఖాళీగా ఉంది” అని ప్రకటించినట్టే అవుతుంది. లోపల తాళం వేసుకోవాలి.

పండుగ రోజుల్లో వాడల్లో, ఊర్లలో పరిచయం లేని వ్యక్తులు తిరుగుతుంటే జాగ్రత్తగా గమనించండి. వారు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.

మీరు ఊరికి వెళ్తున్నా, బంధువుల దగ్గరికి వెళ్తున్నా, ముందుగా మీ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వండి. పోలీసులు అదనపు పర్యవేక్షణ చేస్తారు.

ఒక ఇంట్లో జరిగే చోరీ, ఆ కుటుంబానికే కాదు, చుట్టు పక్కల వారికీ కూడా భయాందోళన కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలి.

పండుగ అనేది ఆనందం పంచుకునే సమయం; అది దొంగతనాలతో చెడిపోకూడదు. మీ జాగ్రత్తలే మీ ఇంటికి రక్షణ కవచం.

ప్రతి కుటుంబం సురక్షితంగా ఉంటేనే, సమాజం సంతోషంగా ఉంటుంది. అందరూ జాగ్రత్తలు పాటించి, సురక్షితంగా, ఆనందంగా దసరా పండుగ జరుపుకోవాలి.

Related posts

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

Leave a Comment

error: Content is protected !!