తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అనిత మాట్లాడుతూ “రాత్రికి, రేపటికి ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున హై అలెర్ట్‌లో ఉండాలి. రాత్రి సమయంలో తీరం దాటే ఈదురుగాలులకు సిద్ధంగా ఉండాలి” అని సూచించారు. అధికారులందరూ రాత్రి వేళల్లో కూడా అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. “ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రహదారులపై చెట్లు పడితే వెంటనే తొలగించాలి.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి” అని ఆమె చెప్పారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.