కరూర్ ర్యాలీకి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నటుడు–రాజకీయ నాయకుడు విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన విజయ్ పార్టీ (టీవీకే) భారీ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు ముందు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, విజయ్ ప్రచార బస్సు వెనుక భాగంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న అభిమానులు స్టార్‌ను చూసేందుకు బస్సుకు చాలా దగ్గరగా వెళ్ళడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియా, టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం పొందింది. మద్రాస్ హైకోర్టు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “విజయ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో పాలుపంచుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు” అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఇక, బస్సు వెనుక భాగంలో మరో ప్రమాదం కూడా వీడియోలో రికార్డ్ అయినట్లు కోర్టు గమనించింది.
“ఈ రెండు ఘటనలపైనా పోలీసు విభాగం సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలి. బాధితుల ఫిర్యాదు లేకపోయినా, రాష్ట్రం బాధ్యతగా చర్యలు తీసుకోవాలి” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ ఎస్పీ కార్యాలయం, వెలయుతంపాలయం పోలీస్‌స్టేషన్ వర్గాలు కూడా ఈ వీడియోలలో కనిపించిన ప్రమాదాలపై కేసులు నమోదు చేసినట్లు ధృవీకరించాయి.