రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో భాగంగా ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు తెలిపారు.
ములకలచెరువులో జరిపిన ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో ముందుగా కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారని…, వారిని విచారించి సేకరించిన సమాచారం అధారంగా ములకలచెరువు గ్రామంలో సోదాలు నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. ములకలచెరువు సమీపంలోని కదిరినత్తునికోట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందని అధికారులు సీఎంకు తెలియజేశారు.
నకిలీ మద్యం తయారు చేస్తున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అలాగే, ఫేక్ లేబుల్స్, వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎ1గా అద్దేపల్లి జనార్ధన్ రావు అనే వ్యక్తిని గుర్తించామని అతనికి విజయవాడలో ఒక బార్ లైసెన్సు ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. నకిలీ మద్యం దందాకు ములకలచెరువుకు వచ్చాడని తెలిపారు.
ఇక్కడ తయారైన మద్యాన్ని పెద్దతిప్పసముద్రంలోని ఆంధ్రా వైన్స్, ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్‌లో విక్రయించినట్టు తెలిపారు. ఈ నకిలీ మద్యం తయారీలో ఇతనే ప్రధాన నిందితుడని, తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను, ఒడిశాకు చెందిన వారిని కూడా నియమించుకున్నాడని తెలిపారు. నకిలీ మద్యం సరఫరాకు ఓ డ్రైవర్‌ను కూడా నియమించుకున్నట్టు వివరించారు.
అద్దేపల్లి జనార్ధన్ రావు సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేస్తున్న అంశాన్ని మిగతా నిందితులు అంగీకరించారని సీఎంకు తెలియజేశారు. నకిలీ మద్యాన్ని విక్రయించిన రాక్ స్టార్ లైసెన్స్ టి రాజేష్ అనే వ్యక్తి పేరిట ఉందని, రాజేష్‌కు సంబంధించిన వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే తాము పట్టుకున్నట్టు తెలిపారు. రెండు వైన్ షాపులపైన సోదాలు నిర్వహించి, సీజ్ చేశామని తెలిపారు.
ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు సీఎంకు తెలిపారు. స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపై కూడా సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒక ప్రణాళికతో అద్దేపల్లి జనార్ధన్ రావు ఏర్పాటు చేసిన ఈ లిక్కర్ తయారీ కేంద్రానికి కొందరు స్థానికుల సహకారం కూడా ఉన్నట్టు గుర్తించామని అధికారులు వివరించారు.
ఏ1 జనార్ధన్ రావు, ఏ2 కొట్టారాజు, ఏ5 పి రాజేష్, ఏ12 కె శ్రీనివాసరావులును అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆర్ధిక లావాదేవీలతో పాటు నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేశారన్న అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని సీఎం స్పష్టం చేశారు.