స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సృజనాత్మక, ఆకర్షణీయ కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకున్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో జరిపిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ ప్రధాన జనరల్ మేనేజర్ ఎస్. రాధాకృష్ణన్ హైదరాబాద్ లోని కోటి లోకల్ హెడ్ ఆఫీస్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, భారత దేశం కొరతల కాలం నుండి ఆత్మనిర్భరత వైపు సాగిన విశేష ప్రయాణాన్ని ఆయన స్మరించారు. చిన్ననాటి జ్ఞాపకాలలో రేషన్ క్యూల్లో నిలబడి ఉండటం, విదేశీ సహాయం, పీడీఎస్ కోసం గోధుమ దిగుమతులు చేసుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు దేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుని ఆర్థిక స్థిరత్వం సాధించినట్లు ఆయన గర్వంగా పేర్కొన్నారు.
దేశ నిర్మాణంలో పౌర సంస్థల కీలక పాత్రను ఆయన ప్రస్తావిస్తూ, అందులో అత్యంత ప్రభావవంతమైనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. పరిశ్రమ, సేవలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో ఎస్బీఐ భారత అభివృద్ధికి మూలస్తంభంలా నిలిచిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, అత్యంత లాభదాయకమైన సంస్థ, అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా ఎస్బీఐ గుర్తింపు పొందినట్లు తెలిపారు.
తెలంగాణలో ఎస్బీఐ 60 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఏడాది ప్రతి జిల్లాలో 1% మార్కెట్ షేర్ పెంపుదలకు కట్టుబడి ఉన్నామని CGM ప్రకటించారు. CGMs, GMs, BGMs, AGMs మరియు ఉద్యోగి సంఘాలు ఈ లక్ష్య సాధనలో ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తన ఈశాన్య భారత అనుభవాలను పంచుకుంటూ, అక్కడి రవాణా, వసతుల సవాళ్లను తెలంగాణలో లభిస్తున్న సౌకర్యాలతో పోల్చారు.
ఇక్కడ లభిస్తున్న అవకాశాలను గుర్తించి, వాటి పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి మనసుకు కలిగించిన బాధను ప్రస్తావిస్తూ, సహ పౌరులు, ఉద్యోగులు, వినియోగదారులు అందరి భద్రత, మద్దతు మన కర్తవ్యం అని గుర్తు చేశారు. తెలంగాణలో ఎస్బీఐని అతిపెద్దదిగా మాత్రమే కాక, ఉత్తమమైన బ్యాంకుగా తీర్చిదిద్దాలని వినియోగదారుల పట్ల ఉన్న ప్రేమతో సేవ చేయాలని CGM పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. క్రీడలు, నృత్యం, విద్య తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బంది, వారి పిల్లలకు సత్కారం అందించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు శెన్బగాదేవి, రవికుమార్ వర్మ (జనరల్ మేనేజర్ NW-1), సతీష్ కుమార్ (జనరల్ మేనేజర్ NW-2), డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఇతర సీనియర్ అధికారులు, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.