ముఖ్యంశాలు హోమ్

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

#Chandra

రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. సూపర్ సిక్స్ హామీలు మొదలుకుని.. వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి తన పంద్రాగస్టు ప్రసంగంలో ప్రస్తావించారు. సూపర్ సిక్స్… సూపర్ హిట్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేదిక నుంచి చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేసిన సామాజిక భధ్రత ఫించన్లు మొదలుకుని శుక్రవారం ప్రారంభించిన స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వరకు ప్రతి అంశాన్ని ఆసాంతం వివరించారు. ఫించన్లు, తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పాటు.. తాను చేసిన తొలి సంతకాల అమలును ముఖ్యమంత్రి వివరించారు. అలాగే ఏపీ బ్రాండ్ గురించి.. పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అందించిన సేవలను.. ఆయా రంగాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

వైసీపీ తీరుపై చంద్రబాబు చురకలు

శాంతి భద్రతలపై ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించిన సందర్భంగా పరోక్షంగా వైసీపీకి చంద్రబాబు చురకలంటించారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తూ.. ప్రొత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వివిధ సందర్భాల్లో చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు ప్రతి శాఖలో వెలుగు చూస్తున్నాయని గత పాలకుల తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలను తాము పునరుద్దరించామనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడిన డ్రామాలను గుర్తు చేశారు. గత ప్రభుత్వం గుంతలతో వదిలేసిన రోడ్ల తీరును ముఖ్యమంత్రి వివరించారు. కొత్త జిల్లాలను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని.. ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. మద్యం, ఇసుక వంటి వాటిల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తావించిన చంద్రబాబు. ఇక ఎస్సీలకు, మైక్రో, డ్రిప్ సబ్సీడీలను గత ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేయడంతోపాటు.. గతంలో జరిగిన రెవెన్యూ అక్రమాలను సరి చేసి.. పేదల భూములకు రక్షణ కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

బనకచర్లకు కట్టుబడే ఉన్నాం

ఇక ఇరిగేషన్ రంగంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి కీలక ప్రస్తావన చేశారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకుంటే.. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని చెప్పడం ద్వారా బనకచర్ల విషయంలో ప్రభుత్వ విధానాన్ని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద వచ్చినప్పుడు కిందకు వదిలేస్తున్న వాళ్లు.. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల విషయంలో చేస్తున్న వాదనల నేపథ్యంలో ఏపీ వాదనను.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేదికగా మరోసారి స్పష్టం చేయడం ఆసక్తి పరిణామంగా నిలిచింది. హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పని చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూనే.. ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రధానికి అండగా ఉందాం

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు పంద్రాగస్టు ప్రసంగంలో వెల్లడించారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం కేటాయించిన సెమీ కండక్టర్ల యూనిట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపు వంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. దీంతోపాటు ఇటీవల అమెరికా భారతదేశంపై విధించిన సుంకాల నేపథ్యంలో మన దేశ ఎకానమీ గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రధానికి అండగా ఉంటామని చంద్రబాబు సంకేతామిచ్చారు. అలాగే ఆపరేషన్ సిందూర్ చేపట్టిన త్రివిధ దళాలకు సీఎం స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై నుంచి సెల్యూట్ చేశారు. వివిధ శాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Related posts

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News

రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!