కృష్ణ హోమ్

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

#FreeBus

‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించామన్నారు.  మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు వారి గౌరవాన్ని పెంచడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.

సూపర్ 6 హామీల్లో ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి పథకాన్ని ఉండవల్లి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తో  కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్‌ను అందించారు. ఉండవల్లి నుంచి మహిళలతో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ వరకు ప్రయాణించారు.

దారి పొడవునా వివిధ బస్ స్టాప్ లలో ప్రజలు, ప్రత్యేకించి మహిళలు స్వాగతం పలికారు. బస్సుల్లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో కరచాలనం చేసేందుకు బస్ వెంబడి పరుగులు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్నంత సేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళలతో మాట్లాడారు. వాళ్ల స్థితిగతులతో పాటు.. ఉచిత బస్ ప్రయాణం వల్ల ఎంత వరకు మేలు కలుగుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ బస్టాండ్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం

‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కొన్ని సీట్లు రిజర్వ్ విధానం చేశాం. ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాను. ఇకపై ప్రతి ఆడబిడ్డ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాను. దారి పొడవునా పలువురు మహిళలతో మాట్లాడాను. వారి మాటలు విన్న తర్వాత ఆడబిడ్డలకు మంచి చేశామన్న తృప్తి కలిగింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

అన్నగా ఇస్తున్న వరం

‘ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు అన్నగా నేను ఇస్తున్న వరం. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం అమలుకు నెలకు రూ.162 కోట్లు, ఏడాదికిరూ.1,942 కోట్లు వ్యయం చేస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డనరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రస్తుతం 11,449 బస్సులు నిర్వహిస్తుండగా అందులో మహిళలు 8,458 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించాం. స్త్రీ శక్తి పథకం ద్వారా 74 శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.

ప్రతీ తల్లీ అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి రావొచ్చు.  ప్రతీ కోడలూ, అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్‌కు వెళ్లి రావొచ్చు. ప్రతి మహిళా, ప్రతి యువతీ ఉద్యోగానికి, విధులకు ఛార్జీ లేకుండా వెళ్లవచ్చు. వృద్దులు హాయిగా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. చిరు వ్యాపారులు వారి ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మంచి ధరకు అమ్ముకోవచ్చు. నరేగా పనులకు, కూలీ పనులకు వెళ్లే మహిళలు తమ ఉపాధి కోసం ఉచిత ప్రయాణం చేసి డబ్బు ఆదా చేయొచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా

‘ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఉపాధి కోసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు వెళ్లి వ్యాపారం చేసుకునే మహిళలకు ఈ పథకం ఎంతో అండగా ఉంటుంది. ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్లే వారికి పథకం నిజమైన ఆర్ధిక శక్తిగా ఉంటుంది. బస్సులో ప్రయాణించే మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, టిక్కెట్ ధర ఎంత? రాయితీ ఎంత ఇస్తున్నామనే వివరాలతో టిక్కెట్ ఇస్తారు. టిక్కెట్ ధర ఎంత ఉన్నా 100 శాతం రాయితీ కల్పిస్తున్నాం. ఈ పోస్ మిషన్ ద్వారా మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ వస్తుంది. మీ ప్రయాణ వివరాలు తెలిపేందుకే మాత్రమే ఈ టిక్కెట్ ఇస్తున్నాం.  బస్సులో ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు’ అని సీఎం స్పష్టం చేశారు. 

డోర్ పికప్ సర్వీసులు పెంపు

‘ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఆర్టీసీ సామర్ధ్యాన్ని పెంచుతున్నాం. రాష్ట్రంలోని 129 డిపోలు, 423 బస్ స్టేషన్లు, 4 జోనల్ వర్క్‌షాపులు… ఇలా మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇకపై బస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి గమ్యం చేరేవరకు బ్రేక్‌డౌన్‌లు తలెత్తవు.  స్త్రీశక్తి అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుని, దానికి తగ్గట్టు పథకాన్ని మెరుగుపరుస్తాం. బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచుతున్నాం. పీఎం-ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నాం. పార్సిల్ సర్వీస్ ద్వారా అధిక ఆదాయం తెస్తున్నాం. డోర్ డెలివరీ, డోర్ పికప్ సర్వీసులు పెంచుతాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఒత్తిడి ఉన్నా… అతిధుల్లా చూడండి

‘మహిళా భద్రత దృష్ట్యా ప్రతీ బస్సులో జీపీఎస్ అమర్చాం. బస్సు ఏ రూట్లో ఎటు వెళ్తుంది అనేది రియల్ టైమ్ ట్రాక్ చేస్తాం. ఇకపై ఏ బస్సు కొన్నా ఎలక్ట్రికల్ బస్సులే, ఏసీ బస్సులే కొంటాం. ఆర్టీసీకి ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తాం. ఈ సందర్భంగా ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లను, కండక్టర్లను ఉద్యోగులను, అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. కొత్త పథకాల అమలు సమయంలో ఉద్యోగులపైనా కొంత ఒత్తిడి ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా మహిళలను అతిథుల్లా చూడాలి’ అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related posts

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News

పీ 4 పై దుష్ప్రచారం తగదు

Satyam News

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

Leave a Comment

error: Content is protected !!