అగ్రసేన్ జయంతి నాటికి కనీసం 25,000 మంది సభ్యులను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు. శనివారం అగర్వాల్ సమాజ్ తెలంగాణ రెండవ ఈజీఎం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాజా అగ్రసేన్‌జీ పూజతో సమావేశం ప్రారంభమైంది. సహ కార్యదర్శి సీమా జైన్ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈజీఎం ముఖ్యమైన ఎజెండాలో భాగంగా రాబోయే రెండేళ్లపాటు సభ్యత్వ రుసుమును రూ.350 నుండి రూ.21కి తగ్గించే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత, ఓటు హక్కు పరిధిని విస్తరిస్తూ, కేంద్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు , శాఖల ప్రస్తుత అధ్యక్షులకు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. జూలై 31న లేదా అంతకు ముందుగా కొత్త ఆఫీస్ బేరర్లతో మొదటి కేంద్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. ప్రివిలేజ్ కార్డ్ సంస్థల ఉద్యోగులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా 2 లక్షల మంది సభ్యులను చేర్చే ప్రణాళిక గురించి సమాచారం ఇచ్చారు. ఉపాధ్యక్షుడు, అగ్రసేన్ జయంతి కన్వీనర్ రూపేష్ అగర్వాల్ కార్యక్రమ సన్నాహాల గురించి సభకు తెలిపారు. జయంతి వేడుకలకు పలు శాఖలు తమ సహకారాన్ని ప్రకటించాయి. ఆమోదించిన తీర్మానాల పట్ల సలహాదారులు చంద్రకాంత్ డకాలియా, హరీష్ అగర్వాల్, అధ్యక్షుడు అనిరుధ్ గుప్తాను, ఇతర ఆఫీస్ బేరర్లను అభినందించారు.
తమ శాఖల నుండి పూర్తిస్థాయిలో ఆఫీస్ బేరర్లు హాజరైనందుకు బహదూర్‌పురా శాఖను, మానసరోవర్ శాఖను సత్కరించారు. అలాగే హాజరైన మహిళా శక్తిని కూడా సత్కరించారు. సహ కార్యదర్శి సీమా జైన్ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్‌కు చెందిన వివిధ శాఖల కేంద్ర కమిటీ సభ్యులు, శాఖల ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.