ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన అద్భుతమైన పర్యాటక, చారిత్రాత్మక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని తెలుపుతూ పర్యాటకులను ఆకర్షించేలా డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా ఏపీటీడీసీ విస్తృత ప్రచారం చేస్తోంది. వీడియోలో కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన కలంకారి ప్రత్యేకత, బాపట్ల జిల్లాలోని ప్రాచీన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం, శాసనాల గొప్పతనం, పరిణామ క్రమం, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత వస్త్రాల విశిష్టత, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఉండవల్లి గుహల ప్రాశస్త్యం వివరిస్తూ వేరువేరుగా రూపొందించిన వీడియోలు పర్యాటకులను ఆకర్షించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించిన వీడియోలను ప్రతి ఒక్కరూ వీటిని లైక్ చేసి షేర్ చేసి మన ప్రాంతాల ప్రత్యేకతను ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కలంకారికి పెడన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని, అలనాటి కలంకారీ వస్త్రాలు ఇక్కడ ప్రధానాకర్షణ అని, సహజ రంగులతో కూడిన అద్దకం ఇక్కడి ప్రత్యేకతని భారతీయ హస్తకళలో ప్రాచీనమైన కలంకారి చిత్రకళను, కళాకారుల నైపుణ్యాన్ని వివరిస్తూ ఏపీటీడీసీ రూపొందించిన వీడియో ఆకర్షిస్తోంది.
జాతీయ స్థాయిలో పేరున్న మంగళగిరి చేనేత, ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల గొప్పతనాన్ని, పానకాల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ ప్రాశస్త్యాన్ని వీడియోలో వివరించింది. చీరల అల్లిక, నిజామ్ డిజైన్ బోర్డర్, నాణ్యతగల రంగుల అద్దకం తదితర అంశాలతో ఇక్కడి చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన జీఐ గుర్తింపు లభించిందని, మానవ కృషి, సహనం, కళా నైపుణ్యం కలిసి తయారయ్యే ఈ చీరలు కేవలం వస్త్రాలు మాత్రమే కావు జ్ఞాపకాలని, భావోద్వేగానికి ప్రతీకని, వారసత్వ గుర్తింపుగా నిలుస్తుందని వివరించింది.
తెలుగు లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశంలోని భట్టిప్రోలులో లభించిన బౌద్ధస్తూపము వల్ల అని , అలనాడు వాణిజ్య, విద్యా కేంద్రంగా విరాజిల్లిన భట్టిప్రోలును సందర్శించాలని ప్రచారం కల్పిస్తోంది..పురావస్తు ఆధారాల ప్రకారం భట్టిప్రోలు స్థూప నిర్మాణం క్రీ.పూ. 3వ శతాబ్దంలోనే జరిగిందని, తెలుగులో లభ్యమయ్యే తొలి శాసనాలుగా భట్టిప్రోలు శాసనాలకు పేరొందని చెబుతోంది.
గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉలితో చెక్కిన సౌందర్యం ఉండవల్లి గుహాలయాలు తప్పక సందర్శించాల్సిన ప్రాంతమని పేర్కొంది. విజయవాడకు సమీపంలోని ఈ ప్రాంతంలో విష్ణుకుండినుల కాలానికి చెందిన దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలతో పాటు 20 అడుగుల ఏక శిలా ‘అనంత పద్మనాభ స్వామి’ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోందని వీడియోలో పేర్కొంది.జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది ఒకటని ఏపీటీడీసీ విస్తృత ప్రచారం చేస్తోంది.