సంప్రదాయబద్దంగా శ్రీ వరలక్ష్మీ పూజ నిర్వహించిన తర్వాత శ్రీ వరలక్ష్మీ వ్రత కథ చదువుకోవడం ఆనవాయితీ. శ్రీ వరలక్ష్మీ పూజ తర్వాత వ్రత కథ చదవడం వల్ల వ్రత ఫలం దక్కుతుంది. సర్వ కోరికలూ సిద్ధిస్తాయి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ఈ విధంగా సాగుతుంది.
సకల మునిగణంబులతోగూడి రమ్యమైయున్న కైలాస పర్వతశిఖరంబున నానావిధంబు లగు మణులు చెక్కినదియు, పాటలములు, అశోకములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు, మొదలగు పెక్కు వృక్షములతో గూడినదియునై, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయి యుండు కల్పవృక్షపుజేరువ, రత్నమయమైన సింహాసనమునందు నింపుగా గూర్చుండియున్నట్టి జనులకు సుఖముల గలిగించువాడయిన శంకరునిజూచి, పార్వతీదేవి కడుముదమంది “సకలలోకంబుల నేలుచు సకల భూతములందును దయగలిగియుందునట్టి యోనాథుడా రహస్యమయి పావనమయిన యొక శుభవ్రతంబును నాకు దెల్పుము”అని లోకముల మేలు కోరినదై యడిగెను. అంతట నీశ్వరుడు పార్వతికిట్లనియె ఓ పార్వతీ! వ్రతములలోనెల్ల నుత్తమ మయిన వ్రతమొక్కటి యున్నది.
అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను ఒసగునది. ఈ పావనవ్రతము వరలక్ష్మీ వ్రతమనబడును. ఈ వ్రతము శ్రావణ మాసంబు నందు పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడాచరింపవలెను. ఓపార్వతీ! ఆవ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్య ఫలంబుజెప్పెద నాలకింపు”మని పార్వతికి పరమశివుడు చెప్పగా నా పార్వతీదేవియు వెండియు శంకరునిజూచి “నాథా! ఆవ్రతంబు నేవిధితో జేయవలెను? ఆ వ్రతంబు నందే దేవతను గొలువవలయును? ఆ వరలక్ష్మీదేవి నింతకు ముందెవరారాధించి యామెను సంతోషపెట్టిరి? అని యడుగగా నీశ్వరుడు పార్వతీదేవితో నిట్లనియె. ఈ కథను శౌనకాది మహామునులకు సూతపౌరాణికుడు చెప్పాడు. “స్త్రీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ శుభకరమైన పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పాడు.
వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం రోజున చేయాలి” అని “ఓ పార్వతీ, వరలక్ష్మీ కథను చెబుతున్నాను. శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతీరోజు తెల్లవారు జామునే నిద్రలేచి స్నానాదులు పూర్తిచేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి “నేనమ్మా వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకుముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను” అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి “నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే ఓ జగన్మాతా! నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు. విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శనభాగ్యం కలిగింది. ఇకనా జన్మధన్యమైంది” అంది కలలోనే.
చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధాన మైంది. చారుమతి నిద్రనుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామల ఉను, ఇరుగుపొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మీవ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు.
కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తిచేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజగదిలో పీటవేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు.
ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలసి “పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవసర్వదా” అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తిచేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలురకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది.
ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తికాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో ఘల్లుఘల్లు మనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్లవైపు చూసుకున్నారు. వారి కాళ్ళకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీ దేవి కటాక్షమేనని చారుమతి, మిగిలిన స్త్రీలు చాలా సంతోషిం చారు.
రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభర ణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తుగర వాహనాలతో, సౌభాగ్యంతో నిండిపోయింది.
వ్రతంలో పాల్గొన స్త్రీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు రధాలు వచ్చి చారుమతి ఇంటివద్ద నిలిచాయి. తమచేత శాస్త్రప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్త ముని గంధం, పుష్పాలతో పూజించారు. దక్షిణ, తాంబూలము, పన్నెండు భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధవులతో కలసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆ రోజునుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీ దేవిని పూజిస్తూ, సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారూ చేయవచ్చు. ఈ కథను విన్నవారికీ, చదివిన వారికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగు తాయి. ఇది సౌభాగ్య దాయకం, సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది.” అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు.