రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేని సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రచారం కోసం మరో వివాదాస్పద ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. తాజాగా లోక్ సభలో ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన ఈ ట్వీట్ పెట్టారు.
‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో గాలిదుమారం రేపుతున్నది. సాధారణంగా ఆయన ఇంగ్లీషులో ట్వీట్లు పోస్ట్ చేస్తారు. ఈసారి ఎందుకో గానీ తెలుగులో పోస్ట్ చేశారు. “మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారా అని నిలదీశారు.
అలాంటి వారిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఏ రాష్ట్రం పేరు గానీ, నాయకుడి పేరు గానీ చెప్పలేదు. అయినా ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించేనని చెప్పకపోయినా అర్ధమౌతోంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి.
ఆయన వాడిన ‘మాజీ ముఖ్యమంత్రి’, ‘ప్రస్తుత ముఖ్యమంత్రి’, ‘ఉప ముఖ్యమంత్రి’ అనే పదాలే ఈ చర్చకు మూలం. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందని ప్రతిపక్షంలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ ముగ్గురి రాజకీయ సమీకరణాలకు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతుండటంతో, నెటిజన్లు ఈ ట్వీట్‌ను ఏపీకి ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అయినప్పటికీ, కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే సందేహాన్ని ప్రకాశ్ రాజ్ లేవనెత్తారు.
ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి కేంద్రానికి నచ్చని నిర్ణయాలు తీసుకుంటే, ఆయనను పక్కకు తప్పించి, తమకు అనుకూలంగా ఉండే ఉప ముఖ్యమంత్రికి అధికారం కట్టబెట్టే ప్రమాదం ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టు పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పడం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా కూడా చూస్తున్నారు.
ప్రకాశ్ రాజ్ ఒక్క ట్వీట్‌తో ప్రశ్నల పదును ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని సున్నితమైన సంబంధాలను తట్టిలేపింది. ఈ ‘చిలిపి సందేహం’ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటనేది కాలమే చెప్పాలి.