చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చని చెప్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెబుతుంటారు.
స్వయంగా ఆచరణలోనూ ఆయన చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అత్యాధునికంగా అన్ని వసతులతో ఈ లైబ్రరీని తీర్చిదిద్దనున్నారు.
దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ హబ్ ఆఫ్ నాలెడ్జ్‌గా ఈ లైబ్రరీ రూపుదిద్దుకోనుంది. ఏడాదిలోపే ఈ లైబ్రరీ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ లైబ్రరీ తోడ్పడుతుందన్నారు లోకేష్. రాష్ట్రా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
దీంతో పాటు విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లో 50 వేల చదరపు అడుగుల స్థలంలో ప్రాంతీయ లైబ్రరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుని దాదాపు 350 మంది విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారని నారా లోకేష్ చెప్పారు.
పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని, ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద లైబ్రరీ కోల్‌కతాలో ఉంది. దీనిని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. ఇందులో దాదాపు 20 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. 1836లో దీనిని ఏర్పాటు చేశారు.