ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినీయం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు రూ.586 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది.
ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్, ఎన్‌క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు – SIPB ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుంది. ఏపీని ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భాగం చేయనుంది. కుప్పం భౌగోళికంగా చాలా వ్యూహత్మకమైన ప్రాంతం.
బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్. ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ఉంటుంది.
అన్ని సవ్యంగా జరిగితే హిందాల్కో ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు అధికారులు. దాదాపు ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. AP ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
దీంతో ఈ సంస్థకు సబ్సిడీ కింద ల్యాండ్, ఇతర ప్రోత్సాహాకాలు అందిచనున్నారు. హిందాల్కో పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో కీలకంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు ఇండియాలోనే తయారు కావడం వలన, భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత దగ్గర కానుంది.